Beating Retreat Ceremony in New Delhi: భారత 75వ గణతంత్ర దిన వేడుకల ముగింపు సందర్భంగా ఏటా నిర్వహించే బీటింగ్ రీట్రీట్ ఈసారి కూడా ఘనంగా జరిగింది. ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో నేడు (జనవరి 29) సాయంత్రం బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం జరిగింది. గణతంత్ర వేడుకల ముగింపునకు సూచకంగా బీటింగ్ రీట్రీట్ ను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాతకాలం నాటి గుర్రపు బగ్గీలో వచ్చారు. ఈ బగ్గీ బ్రిటిష్ కాలంలోని ఓ భారత వైస్రాయ్‌కు చెందిన సంగతి తెలిసిందే. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా కేంద్ర మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులు, సాధారణ ప్రజలు అప్పటికే అక్కడికి చేరుకోగా.. రాష్ట్రపతి రాకతో కార్యక్రమం ప్రారంభం అయింది. 


త్రివిధ దళాలు (ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్), సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) కు చెందిన మ్యూజిక్ బ్యాండ్స్ ఈ కార్యక్రమంలో దేశభక్తి ట్యూన్లను ప్లే చేశాయి. ఆ ట్యూన్లకు తగ్గట్లుగా కాళ్లు కదుపుతూ దళాలు చేసిన మార్చ్ ఆకట్టుకుంది. బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం శంఖ్‌నాడ్ ట్యూన్ తో ప్రారంభం అయింది. ఆ తర్వాత వీర్ భారత్, సంగమ్ దూర్, దేశోన్ కా సర్తాజ్ భారత్, భగీరథి, అర్జున ట్యూన్లను వివిధ వాయిద్యాలు, డ్రమ్ లతో ప్లే చేశారు. సీఏపీఎఫ్ బ్యాండ్ భారత్ కె జవాన్, విజయ్ భారత్ లాంటి ట్యూన్లను ప్లే చేసింది. 


బీటింగ్ రీట్రీట్ నిర్వహించేది ఎవరు?
బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం మొత్తం లెఫ్టినెంట్ కల్నల్ విమల్ జోషి నేతృత్వంలో జరిగింది. ఆర్మీ బ్యాండ్ అనేది సుబేదార్ మేజర్ మోదీలాల్, మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ (MCPO) ఎం ఆంటొనీ ఇండియన్ నేవీ బ్యాండ్‌కు, వారెంట్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాండ్‌ ను నిర్వహిస్తారు. సీఏపీఎఫ్ బ్యాండ్ కు జీడీ రాణిదేవి నిర్వహించారు. ఇక వాద్యకారులు (Buglers) నయిబ్ సుబేదార్ ఉమేశ్ కుమార్, పైప్స్ అండ్ డ్రమ్స్ బ్యాండ్ సుబేదార్ మేజర్ రాజేందర్ సింగ్ లీడర్ షిప్ లో జరిగాయి.