సీఎన్‌జీ ధరల పెరుగుదల నేపథ్యంలో ఢిల్లీలో ఆటో, ట్యాక్సీ ఛార్జీలు పెరిగాయి. దీంతో నగరంలో ప్రయాణానికి ఖర్చు ఎక్కువ కానుంది. ఢిల్లీ ప్రభుత్వం కూడా వీటి ధరల సవరణకు అంగీకరించింది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. ఢిల్లీలో ఆటో చార్జీలు చివరిసారిగా 2020లో సవరించారు. టాక్సీ చార్జీలు చివరిసారిగా 2013లో పెంచారు.


ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆటోలో ప్రయాణించే వ్యక్తి మొదటి 1.5 కిలోమీటర్లకు ప్రస్తుతం ఉన్న రూ.25కి బదులుగా రూ.30 చెల్లించాలి. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు ప్రస్తుతం ఉన్న రూ.9 స్థానంలో రూ.11 చెల్లించాలి.


టాక్సీల విషయానికి వస్తే... మొదటి కిలోమీటరు వరకు ఏసీ, నాన్-ఏసీ వాహనాల ధరలలో ఎటువంటి మార్పు లేదు. మొదటి కిలోమీటర్ దాటాక నాన్-ఏసీ వాహనాలకు కిలోమీటరుకు రూ.14 బదులు రూ.17 చెల్లించాలి. అలాగే ఏసీ వాహనాలకు మాత్రం రూ.16 కాకుండా రూ.20 చెల్లించాలి. వెయిటింగ్ చార్జీల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇది గంటకు రూ.30గా ఉంది. ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ ఆటో రిక్షా, టాక్సీ సంఘాలు, యూనియన్ల నుంచి చార్జీల పెంపు అంశంపై అనేక ప్రాతినిధ్యాలను స్వీకరించారు.