అసోం- మేఘాలయ మధ్య 50 ఏళ్లుగా నెలకొన్న సరిహద్దు వివాదానికి ముగింపు పలికేలా రెండు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాలు సరిహద్దు ఒప్పందంపై మంగళవారం సంతకం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.






పరిష్కారం


ఈ ఒప్పందం ద్వారా 1972 నుంచి నెలకొన్న 884 కిలోమీటర్ల సరిహద్దు వివాదంలో ప్రధాన సమస్యలకి పరిష్కారం దొరికినట్లైంది. సరిహద్దుకు సంబంధించి 12 అంశాల్లో వివాదం ఉండగా తాజా ఒప్పందంతో ఆరు అంశాలు పరిష్కారమయ్యాయి. అంటే 70 శాతం సరిహద్దు సమస్య ముగిసినట్లయింది. మిగతా 30 శాతం సరిహద్దుకు సంబంధించిన ఆరు అంశాలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.


వివాదంగా ఉన్న 36.79 చదరపు కి.మీ. భూభాగంలో 18.51 చదరపు కి.మీ. అసోం వద్ద ఉండేలా మిగతా 18.28 చదరపు కి.మీ. మేఘాలయకు చెందేలా ఈ ఒప్పందంలో అంగీకారం కుదిరింది.


కేంద్రం కృషి


యాభై ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. దీంతో ఈ అంశంపై ఇరు రాష్ట్రాలు దృష్టిపెట్టాయి. తమకున్న అభ్యంతరాలు, పరిష్కారాలతో కూడిన డ్రాఫ్ట్‌ను హోం వ్యవహారాల శాఖకు అందజేశాయి. వీటిని పరిశీలించిన కేంద్రం ఇద్దరు సీఎంలతో చర్చించి, తగిన పరిష్కారాలు సూచించింది. దీంతో అసోం-మేఘాలయ సీఎంలు ఇద్దరూ తాజా ఒప్పందంపై సంతకాలు చేశారు.


ఇదే వివాదం


1972లో అసోం నుంచి మేఘాలయ విడిపోయిన సమయంలో తొలిసారి ఈ దీర్ఘకాలిక వివాదం రాజుకుంది. దీనిపై గతేడాది ఆగస్టులో రెండు రాష్ట్రాలు వేర్వేరుగా 3 కమిటీల చొప్పున నియమించాయి. పరిష్కారం దిశగా రెండు విడతలుగా చర్చలు కూడా జరిగాయి.


Also Read: Rajya Sabha Elections 2022: 6 రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు ఒకే రోజు పోలింగ్


Also Read: Tamil Nadu News : రూపాయి నాణేలతో బైక్ కొన్న యువకుడు, లెక్కపెట్టడానికే 10 గంటలు పట్టింది!