స్టేషన్‌లో ఫోన్ మోగింది !
స్టేషన్‌లో చిరాకుగా ఉన్న పోలీస్.. అంతే చిరాకుగా ఫోన్ ఎత్తి హలో అన్నాడు. అవతల వైపు నుంచి ఓ బాలిక ఏడుపు వినిపించడంతో చిరాకు అంతా వదిలేసి అలర్ట్ అయ్యాడు. అంటే అతను డ్యూటీలోకి వచ్చేశాడన్నమాట. ఆ బాలిక మాటలు విన్న వెంటనే .. క్యాప్ పెట్టుకుని సిబ్బందిని తీసుకుని బయలుదేరాడు. బాలిక చెప్పిన ఇంటికి వెళ్లేసరికి అక్కడ సీన్ భయంకరంగా ఉంది. ఓ మహిళ దారుణంగా హత్యకు గురై ఉంది. అక్కడ ఆ బాలిక ఏడుస్తూ కూర్చుంది. పోలీసులు రాగానే ఆ బాలిక ఏడుస్తూ వెళ్లి .., వాళ్లను పట్టుకుని తన తల్లిని ఎవరో వచ్చి చంపేశారని చెప్పి కింద పడిపోయింది..!
చెన్నైలో జరిగిన ఓ మహిళ హత్య ఘటన గురించి నేరాలు - ఘోరాలు తరహాలో చెప్పుకుంటే ఇలాగే ప్రారంభించాలి. కానీ స్టోరీ ఇక్కడ్నుంచి కొనసాగించాలంటే ... మాత్రం సీఐడీ సీరియల్‌కు షిప్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈ స్టోరీలో క్లైమాక్స్ అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది మరి.!
హత్యకు గురైన మహిళ పేరు మునియలక్ష్మి. ఆమెను భర్త వదిలేశాడు. దాంతో ఇళ్లల్లో పనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లల్ని పోషిస్తోంది. ఈ క్రమంలో హత్యకు గురైంది. శత్రువులు ఎవరూ లే్రు. దుండగులు వచ్చి చంపేశారని బాలిక చెబుతోంది. వారెవరో తాను ఎప్పుడూ చూడలేదని అంటోంది. అంతకు మించి ఏమీ చెప్పడం లేదు. ఎంత పరిశోధించినా పోలీసులకు ఏ ఆధారమూ దొరకలేదు. కానీ హత్య జరిగిన వైనం.. ఆ బాలిక చెబుతున్న వివరాలకుఎక్కడో పొంతన లేదన్నట్లుగా పోలీసులకు అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారంచారు. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది.
మునియలక్ష్మి ఈజీ మనీ కోసం తన కుమార్తెను వ్యభిచార వృత్తిలో దింపాలని నిర్ణయించుకుంది. ఇందుకు మైనర్ అయిన తన కుమార్తెను ఒప్పించాలని చూస్తోంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. డిప్లొమా చదువుతూ మధ్యలో ఆపేసిన మునియలక్ష్మి కుమార్తెకు తల్లి తనను వ్యభిచార రొంపిలోకి దింపడం ఇష్టం లేదు. ఎలా తప్పించుకోవాలో చూస్తోంది. ఆమె బతికి ఉంటే... తనను ఇలా వదిలి పెట్టదని.. తన శరీరంతో వ్యాపారం చేస్తుందని ఓ అంచనాకు వచ్చేసింది. ఇక తల్లిని అడ్డు తప్పించుకోవడమే మార్గమని అనుకుంది.
అనుకున్నదే తడవుగా తన స్నేహితులు ముగ్గురికి విషయం చెప్పింది. వారు అంగీకరించారు. ప్లాన్ ప్రకారం తల్లిని చంపింది. తనపై అనుమానం రాకుండా పోలీసులకు ఫోన్ చేసింది. కానీ ఆ రహస్యాన్ని తనలోనే దాచుకోలేకపోయింది. చివరికి దొరికిపోయి.. కటకటాల వెనక్కి వెళ్లింది.