Is National emblem Changed : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ కొత్త భవనంపై " జాతీయ చిహ్నాన్ని " నిరాడంబరంగా ఆవిష్కరించారు. స్పీకర్ చేయాల్సిన కార్యక్రమాన్ని ప్రధాని చేశారని, ప్రతిపక్షాలను ఆహ్వానించకుండా సొంత కార్యక్రమంలా చేశారని ఇతర పార్టీల నుంచి విమర్శలను పక్కన పెడితే కొత్తగా మరో వివాదం కూడా ప్రారంభమయింది. అదేమిటంటే జాతీయ చిహ్నంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని.. ఇలా చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని చెబుతున్నారు.
జాతీయ చిహ్నం అందరికీ . ఎటు చూసినా నాలుగు సింహాలు కనిపిస్తూ ఉంటాయి. కింద అశోకచక్రంతో సత్యమేవ జయతే అనే నినాదం ఉంటుంది. కరెన్సీ నోట్లు సహా ఎక్కడ చూసినా మనకు ఈ జాతీయ చిహ్నం కనిపిస్తుంది. ఈ చిహ్నాన్ని భారీ సైజులో తయారు చేయించి పార్లమెంట్ కొత్త భవనంపై ఆవిష్కరించారు.అయితే ఇప్పటి వరకూ వాడుకలో ఉన్న జాతీయ చిహ్నం.. ప్రధాని ఆవిష్కరించిన చిహ్నం మధ్య చిన్న తేడా కనిపిస్తోంది. అదేమిటంటే సింహం గర్జన.
జాతీయ చిహ్నంలో సింహం గుర్జిస్తున్నట్లుగా ఉండదు. కాస్త నోరు తెరిచి ఉంటుంది. కానీ ప్రధాని ఆవిష్కరించిన చిహ్నంలో సింహం గర్జిస్తున్నట్లుగా ఉంది. సింహం ముఖం దగ్గర చాలా స్పష్టమన తేడా కనిపిస్తోంది. అందుకే పలువురు జాతీయ చిహ్నంలో మార్పు వచ్చిందని... ఇలా మార్పు చేయడం కరెక్టేనా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
దేశంలో State Emblem of India ( Prohibition of Improper Use Act ) , 2005 ; State Emblem of India ( Regulation of Use ) , Act , 2007 వంటి చట్టాలు ఉన్నాయి . ఈ కారణంగా ఆ చిహ్నాల్లో చిన్న మార్పులు చేయాలన్నా సాధ్యం కాదు. అయితే ఈ విమర్శలపై ఇంకా కేంద్ర అధికారవర్గాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎక్కడా మార్పు లేదని కానీ.. చిన్న చిన్న మార్పులు చేశామని కానీ చెప్పలేదు. కానీ పార్లమెంట్ భవనంపైన ఇలాంటి విగ్రహం పెట్టారు కాబట్టి... కేంద్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే..ప్రజల్లో గర్జిస్తున్న సింహమే నిజమైన నేషనల్ ఎంబ్లం అనుకునే ప్రమాదం ఉందంటున్నారు.