Pawan Kalyan Latest News: త్రిభాష విధానంపై గతంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ ఆధారంగా విమర్శలు చేస్తున్న వారికి క్లారిటీ ఇచ్చారు.తాను ఎప్పుడూ హిందీని భాషగా వ్యతిరేకించలేదని అన్నారు. నూతన జాతీయ విద్యావిధానం 2020 పేరుతో హిందీన్ని బలవంతగా రుద్దుతారేమో అని ఆందోళన వ్యక్తి చేసినట్టు వెల్లడించారు.
ఒక భాషను బలవంతంగా రుద్దడం, లేదా భాషను గుడ్డిగా వ్యతిరేకించడం రెండూ తప్పే అని చెప్పిన పవన్ కల్యాణ్ దేశ సమగ్రతకు ఇది మంచిది కాదని సోషల్ మీడియా వేదికలో వివరణ ఇచ్చారు. "ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం; రెండూ మన భారతదేశం జాతీయ, సాంస్కృతిక సమగ్రత లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడవు."
హిందీని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు పవన్ కల్యాణ్. దాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలనే వాదనను మాత్రమే తప్పుపట్టినట్టు తెలిపారు. "నేను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదు. దానిని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించాను. NEP 2020లో హిందీని అమలు చేయడం లేదు. కానీ బలవంతంగా రుద్దుతున్నారనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు."
కొత్తగా అమలు చేస్తున్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం విద్యార్థులు ఏవైనా రెండు భారతీయ భాషలు నేర్చుకోవచ్చని తెలిపారు. ఇందులో వారి మాతృభాష కూడా ఉంటుందని వివరించారు. "NEP 2020 ప్రకారం, విద్యార్థులు విదేశీ భాషతోపాటు ఏవైనా రెండు భారతీయ భాషలను(వారి మాతృభాషతో సహా) నేర్చుకునే వెసులుబాటు ఉంది. వారు హిందీని నేర్చుకోము అంటే, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ, అస్సామీ, కాశ్మీరీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, సింధీ, బోడో, డోగ్రీ, కొంకణి, మైథిలి, మెయిటీ, నేపాలీ, సంతాలి, ఉర్దూ లేదా ఏదైనా ఇతర భారతీయ భాష ఎంచుకోవచ్చు."
భాషా వైవిధ్యాన్ని పెంచడం కోసం జాతీయ ఐక్యత పెంపొందించడం కోసం ఈ మల్టీలాంగ్వేజ్ పాలసీ తీసుకొచ్చారని అభిప్రాయపడ్డారు పవన్ కల్యాణ్. ఇందులో రాజకీయాలు జొప్పించి ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా పవన్ మాట మార్చారని విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. "బహుళ భాషా విధానం విద్యార్థులకు శక్తిని ఇవ్వడానికి, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి, భారతదేశ భాషా వైవిధ్యాన్ని కాపాడటానికి రూపొందించారు. ఈ విధానాన్ని రాజకీయ అజెండాల కోసం తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ తన వైఖరి మార్చుకున్నారని విమర్శిస్తూ అవగాహనా లోపాన్ని బహిర్గతం చేసుకుంటున్నారు. ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యా ఎంపిక సూత్రానికి జనసేన ఎప్పుడూ దృఢంగా కట్టుబడి ఉంది."
పిఠాపురంలో పవన్ చేసిన ప్రసంగంపై రాత్రి నుంచి ప్రకాశ్ రాజు వరసపెట్టి ట్వీట్‌లు చేస్తున్నారు. గతంలో ఆయన చేసిన కామెంట్స్ గుర్తు చేస్తూ భజన సేనగా మారాడని విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో పవన్ ఇలా రియాక్ట్ అయ్యారు. అయితే ఎక్కడ కూడా ప్రకాశ్ రాజ్ పేరు కానీ తనను విమర్శించే వారి ప్రస్తావన లేకుండా పవన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.