Cyber Scam With Gift Voucher: ఈ రోజుల్లో, చాలా పనులు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. కూరగాయలు కొనడం నుంచి క్యాబ్ బుకింగ్‌ వరకు అన్ని పనులను అరచేతిలోని మొబైల్‌ నుంచే చేయవచ్చు. ఇప్పుడు, జేబులో ఎక్కువ డబ్బును కూడా తీసుకువెళ్లడం లేదు. నగదు లావాదేవీలు UPI ద్వారా జరుగుతున్నాయి. ఈ ఆన్‌లైన్‌ గేమ్ ప్రజల పనులను సులభంగా మార్చింది  & అందరికీ బాగా నచ్చింది. అదే సమయంలో, అనేక సమస్యలు కూడా సృష్టించింది. ఆన్‌లైన్‌ లావాదేవీల వల్ల చాలామంది ప్రజలు మోసాల బాధితులుగానూ మారుతున్నారు.


ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్ చాలా వేగంగా వ్యాపించింది. షేర్ మార్కెట్‌లో భారీ లాభాలు వస్తాయని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇదే తరహాలో, ఇటీవల మరో పెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.1,000 ఓచర్‌ కోసం ఒక మహిళ రూ.51 లక్షలు పోగొట్టుకుంది. 


రూ.51 లక్షలు మోసం జరిగింది ఇలా..
దిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన మీను రాణి అనే మహిళను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా ఓ అపరిచితుడు సంప్రదించాడు. తన పేరు హరి సింగ్ అని, తాను 15 సంవత్సరాల అనుభవం ఉన్న పెట్టుబడి నిపుణుడిని అని పరిచయం చేసుకున్నాడు. మీను రాణితో మాట్లాడిన తరువాత, ఆమెను ఒక వాట్సాప్ గ్రూపులో చేర్చాడు. ఆ తర్వాత, అదే గ్రూపులోని మరొక మహిళ మీను రాణిని సంప్రదించింది. మహిళా పెట్టుబడిదారులకు రూ. 1000 విలువైన అమెజాన్ ఓచర్‌లు పంపుతున్నట్లు రెండో మహిళ మీను రాణికి చెప్పింది. దీని కోసం ఆమె తన అమెజాన్ ఖాతాలోకి లాగిన్ అవ్వాలని సూచించింది. మీను రాణి అమెజాన్ అకౌంట్‌లోకి లాగిన్ అయిన వెంటనే ఆమెకు వెయ్యి రూపాయలు వచ్చాయి. దీంతో, ఆ వాట్సాప్‌ గ్రూప్‌ మీద మీను రాణికి నమ్మకం కుదిరింది. సరిగ్గా ఇక్కడే ఆమె సైబర్‌ మోసగాళ్ల ఉచ్చులో పడింది. 


ఆన్‌లైన్ మాయగాళ్లు మీను రాణి నమ్మకాన్ని గెలుచుకున్నారు & స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని ఆమెను ప్రలోభ పెట్టారు. తమకు షేర్‌ మార్కెట్‌ అంటే కొట్టిన పిండి అని & ఒక్క నెలలో మూడు నుంచి ఐదు రెట్ల లాభం ఇస్తామని హామీ ఇచ్చారు. దీనికి సాక్ష్యంగా, అదే గ్రూప్‌లో ఉన్న మరికొందరి గురించి చెప్పారు, వాళ్లు లక్షలు ఆర్జిస్తున్నట్లు నమ్మించారు. మీను రాణి తన బంధువుల నుంచి డబ్బు అప్పుగా తీసుకొని చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టింది. ఆ కేటుగాళ్లు, మీను రాణి పెట్టుబడిపై లాభాలు వచ్చాయంటూ నకిలీ యాప్‌లలో లాభాలు చూపించారు. కానీ, డబ్బును ఆమె చేతికి ఇవ్వలేదు. ఆశ పెరిగిపోయిన మీను రాణి మరింత డబ్బు పెట్టుబడి పెట్టడానికి బంధువుల నుంచి ఇంకా రుణం అడిగింది. ఓ బంధువుకు అనుమానం వచ్చి ఆరా తీయగా ఈ మోసం మొత్తం బయటపడింది. అప్పటికే రూ. 51 లక్షలు పోయాయి. 


ఈ పద్ధతులతో మిమ్మల్ని మీరు రక్షించుకోండి
ఎవరైనా సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని సంప్రదించి డబుల్ లాభాలు, ట్రిపుల్ లాభాలు అని ఊదరగొట్టి & డబ్బులు పెట్టుబడి పెట్టమని అడగవచ్చు. అదంతా మోసమని గ్రహించండి, అలాంటి మాయగాళ్ల ఉచ్చులో పడకండి. ఒకవేళ మీరు  పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా ఆ లావాదేవీ చేస్తున్న యాప్‌పై దృష్టి పెట్టండి. మిమ్మల్ని సంప్రదించిన వ్యక్తి నిజాయితీపరుడో, కాదో తెలుసుకోవడానికి అతని పేరును, అతని కంపెనీ గురించి గూగుల్‌లో శోధించండి. ఒకవేళ మీ డబ్బు ఇరుక్కుపోతే సమయం వృథా చేయకుండా "నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్" (National Cybercrime Helpline Number) 1930 కు కాల్ చేసి మీ ఫిర్యాదును నమోదు చేయండి.