Mughal emperor Bahadur Shah Zafar: భారత దేశ చరిత్రలో మొఘలులకు ప్రత్యేక అధ్యాయం ఉంది. అనేక ప్రాంతాలను పరిపాలించిన చరిత్ర ఉంది. కానీ ఈ రాజకుటుంబాల వారసులకు, వారి సంపద మరియు హోదా ఇప్పుడు లేదు. ఇంకా చెప్పాలంటే కడు పేదరికంలో ఉన్నారు. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ముని మనవరాలు సుల్తానా బేగం ఇప్పుడు కూడుకు గతిలేని పేదరికంలో ఉన్నారు. తన పూర్వీకులు ఒకప్పుడు అనుభవించిన విలాసానికి పూర్తి భిన్నంగా కోల్‌కతా శివార్లలో ఒక ఇరుకైన గుడిసెలో నివసిస్తున్నారు. కొద్ది రోజుల కిందట యూపీ సీఎం అదిత్యనాథ్ మొఘలులు చేసిన అరాచకాలకు వారి వారసులు శిక్ష అనుభవిస్తున్నారని.. కోల్ కతా రిక్షా తొక్కుకుంటూ జీవిస్తున్నారని ప్రకటించారు. అది నిజమేనని తేలింది.
చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ముని మనవరాలు అయిన 60 ఏళ్ల సుల్తానా బేగం ఇప్పుడు కోల్‌కతాలోని అత్యంత పేద ప్రాంతాలలో ఒకటైన హౌరాలో రెండు గదుల చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. సుల్తానా ముత్తాత బహదూర్ షా జాఫర్ 1837లో సింహాసనాన్ని అధిష్టించిన చివరి మొఘల్ చక్రవర్తి. అప్పటికే శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యం బాగా బలహీనపడింది. 1857లో భారత తిరుగుబాటు చెలరేగినప్పుడు పారిపోయాడు. రంగూన్ లో 1862లో మరణించాడు.
1980లలో తన భర్త ప్రిన్స్ మీర్జా బేదార్ బుఖ్త్ మరణం తర్వాత సుల్తానా జీవితం మలుపు తిరిగింది. అప్పటి నుండి, ఆమె నెలకు కేవలం 6,000 రూపాయల పింఛనుతో బతుకీడుస్తున్నారు. ఆమె ఆరుగురు పిల్లలను పోషించడానికి కష్టపడుతోంది. సుల్తానాకు ప్రభుత్వం నుండి ఎటువంటి మద్దతు లభించలేదు. సహాయం కోసం ఆమె అనేక విజ్ఞప్తులు వేసినప్పటికీ, ఆమె ఆర్థిక పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది. ఆమె కుమార్తెలు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, పెద్దగా సహాయం అందించ లేకపోతున్నారు.
కొన్ని స్వచ్చంద సేవా సంస్థలు వారికి సాయం చేస్తున్నాయి. సుల్తానా తన కుటుంబ రాజ వంశపారంపర్యత గురించి ఇప్పుడు ఏ మాత్రం సంతోషంగా లేదు. బతకడానికి కాస్తంత తిండి, ఉండటానికి గూడు ఉంటే చాలనుకుంటోంది. బతకడానికి ఆమె టీ స్టాల్ పెట్టుకోవడానికి, టైలరింగ్ దుకాణం పెట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. కానీ విఫలమయింది. మొఘలులు ఆలయాలపై అనేక దుర్మార్గాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.