Jalshakti Department Review : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) మధ్య ఉన్న నీటి వివాదాలు, ప్రాజెక్టుల వ్యవహారంపై నేడు కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ (Central Jalshakti Department) కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ (Debasri Mukharjee) ఇవాళ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని (High Level Meeting) ఏర్పాటు చేశారు. నాలుగు అంశాలను సమావేశ ఎజెండాలో పొందుపరిచారు.


ఢిల్లీ (Delhi)వేదికగా జరిగే సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ, ఏపీ జలవనరుల శాఖ అధికారులు హాజరుకానున్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టుల స్వాధీనం, శ్రీశైలం, సాగర్ ఆపరేషన్ ప్రోటోకాల్స్‌, బోర్డుకు సంబంధించిన నిధులే అజెండాగా భేటీ జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమావేశం కానున్న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహిస్తున్న సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. 


శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంల ఆపరేషన్ ప్రోటోకాల్ పై ప్రధాన చర్చ
కేంద్ర జలశక్తి శాఖ గతంలో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం... కృష్ణా నదిపై గుర్తించిన 15 ఉమ్మడి జలాశయాల నిర్వహణను నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించలేదు. ఇవాళ జరిగే సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. సాగర్ వివాదంపై గతంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో జరిగే సమావేశంలో...నాగార్జునసాగర్ వద్ద పరిస్థితిని సమీక్షించనున్నారు. మళ్లీ ఉద్రిక్తలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంల ఆపరేషన్ ప్రోటోకాల్ అంశంపైనా రెండు రాష్ట్రాల అధికారులతో దేబశ్రీ ముఖర్జీ చర్చించనున్నారు. 


నిధులు విడుదలలో రెండు రాష్ట్రాలు అలసత్వం
కేఆర్ఎంబీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి నిధుల విడుదల అంశంపైనా సమావేశంలో చర్చించనున్నారు. బోర్డు నిర్వహణ కోసం బడ్జెట్​కు అనుగుణంగా ప్రతి ఏటా తెలంగాణ, ఏపీ నిధులు విడుదల చేయాల్సి ఉంటది. అయితే రెండు రాష్ట్రాలు నిధులు విడుదలలో అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. దీంతో బకాయిలు భారీగా పెరిగిపోయాయి. ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందని ఇటీవల బోర్డు వెల్లడించింది. దీనిపై ఈ నెల 12న బోర్డు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ...ఇవాళ్టి భేటీ నేపథ్యంలో వాయిదా వేశారు. కృష్ణా బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.45.63 కోట్ల నిధులు వచ్చాయి. ఇప్పటి వరకు రూ.45.45 కోట్లు ఖర్చు చేశారు. అందులో ఏపీ ఇచ్చిన మొత్తం రూ.24.91 కోట్లు, తెలంగాణ ఇచ్చిన మొత్తం రూ.19.71 కోట్లు. కేంద్రం ఇచ్చిన కోటి రూపాయల కార్పస్ ఫండ్ కూడా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణ రూ.13.61 కోట్లు, ఏపీ రూ.11.75 కోట్లు బోర్డుకు ఇవ్వాల్సి ఉంది. మే నెలలో ఏపీ ప్రభుత్వం రూ.3.35 కోట్లు ఇచ్చింది. ఈ సమావేశంలో బోర్డుకు నిధుల అంశం కూడా ప్రధానంగా చర్చించనున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పరస్పర ఫిర్యాదులపైనా సమీక్ష జరపనున్నారు.