130 ఏళ్ల కిందట వెనుకబడిన కులాల పట్ల ఉన్న వివక్ష. ఆ వివక్షతోనే ఒక చిన్న బాలుడిని పాఠశాల గదిలో నుండి గెంటేశారు. తోటి విద్యార్ధులు ఆయన్ని కలవనివ్వలేదు. ఎన్నో అగచాట్ల మధ్య చదువుని రాజ్యాంగాన్ని రచించే అంత గొప్ప స్థాయికి చేరుకున్నాడు. దేశ భవిష్యత్ గురించి ఆలోచించాడు. అందరి ఛీత్కారాలను ఎదుర్కొన్నప్పటికీ ఎవరూ అలా కాకూడదని శ్రమించాడు. ఆయనే బాబా సాహెబ్ అంబేద్కర్. దేశానికి ఓ ఉన్నతమైన రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగాన్ని పాటిస్తే దేశం ఉన్నత స్థానంలోకి అనతి కాలంలోనే వెళ్లేది. కానీ ఇంకా రాజ్యాంగాన్ని గొప్పగా చెబుతున్నాం కానీ పాటించడం మాత్రం కష్టంగా మారింది. పైగా రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని మార్చాలనే వాదనను తరచూ తెరపైకి తెస్తున్నారు.
దేశానికి రాజ్యాంగ రక్షణ ఇచ్చిన అంబేద్కర్ !
రాజ్యాంగం అంటే ఓ పుస్తకం మాత్రమే కాదు. అది దేశానికి మార్గదర్శి. అది చూపిన మార్గాన్ని అనుసరించడమే పాలక వ్యవస్థ బాధ్యత. అంతే కదా. అది నిర్దేశించిన ప్రకారం పాలన సాగిస్తూ సామాజిక సమతను సాధించడం పాలక వ్యవస్థ కర్తవ్యం. కానీ వాస్తవ స్థితి అలా ఉందని ఎవరూ గట్టిగా చెప్పలేని పరిస్థితి. రాజ్యాంగం అమలులోకి ఏడున్నర దశాబ్దాలు గడిచిపోయాయి.కానీ పెద్దగా మార్పు రాలేదు.సామాజిక అంతరాలు తొలిగిపోలేదు. మరింతగా పెరిగిపోయాయి. ధనవంతులు ధనవంతులవుతున్నారు. పేదలు నిరుపేదలవుతున్నారు. కోట్లాది మందికి అసలు ఆహారమే లభించడం లేదు. చదువు అందరికీ లభించడం లేదు. వైద్యం కొనుగోలు సరుకుగా మారిపోయింది. సరైన వైద్యం లభించక లక్షలాది మంది ప్రాణాలు వదులుతున్నారు. కారణం రాజ్యాంగ వైఫల్యం కాదు. దాన్ని అమలు చేయడంలో రాజకీయ నాయకత్వానికి నిజాయితీ, చిత్తశుద్ధి లోపించడమే.
రాజ్యాంగం విఫలమైందని చెప్పే ప్రయత్నంలో రాజకీయ పార్టీలు !
రాజ్యాంగాన్ని మార్చాలని చాలా కాలంగా రాజకీయ పార్టీలు చర్చకు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ నేతలు అడపా దడపా ఈ వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మళ్లీ రాయాలన్నారు.ఇలా వీరు మాట్లాడినప్పుడల్లా దుమారం రేగుతుంది. కానీ చర్చ అయితే జరుగుతుంది. ఈ చర్చల సారాంశం రాజ్యాంగం విఫలమయిందా అనేదే. సంపూర్ణ సమత రాసిన వారి దూరదృష్టి, లక్ష్యం. దాని కోసం చాలా కట్టుదిట్టమైన నిబంధనలు రూపొందించారు. వాటిని పాటించడంలో నిజాయితీతో కూడిన ప్రయత్నాలు ఏమీ చేయకుండా రాజ్యాంగాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొత్త రాజ్యాంగాన్ని రాయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా రాజకీయ నాయకత్వంలో ఈ అంశం తీవ్ర దుమారాన్నే లేపింది. అంతకు ముందు పలువురు బీజేపీ నేతలు అదే విధంగా మాట్లాడారు. తాము రాజ్యాంగాన్ని మార్చడానికే ఉన్నామని కొన్నాళ్ల కిందట కేంద్రమంత్రిగా ఉన్న అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆరెస్సెస్ నేత మోహన్ భగవత్ సహా అనేక మంది రాజ్యాంగం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సందర్భాన్ని బట్టి సవరణలు చేస్తూనే ఉన్న పాలకులు !
ఇప్పటికే రాజ్యాంగానికి 105 సవరణలు జరిగాయి. కాలానుగుణంగా మారిన సామాజిక స్థితిగతులకు వీలుగా సవరణలు జరిగాయి. ఇందులో అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదు .సమాజ హితం కోసమే రాజ్యాంగం నిర్మించుకున్నారు కాబట్టి ఆ సమాజం కోసం సవరణలు అనివార్యమే అయినపుడు మార్పు తప్పదు కదా.రాజ్యాంగం రాసిన నాటి స్థితిగతులు ఈ రోజు లేవు .అయితే ఇక్కడ కొత్త రాజ్యాంగం అన్న ప్రతిపాదనే దుమారానికి కారణం. బీజేపీ కి ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలన్న కోరిక ఉంది. .అది వారు దాచుకున్న సంగతి ఏమీ కాదు. రాజ్యాంగ నిర్మాణ సమయం నుంచే దానిలోని ప్రతిపాదనలు పట్ల ఆరెస్సెస్ లాంటి ప్రస్తుతం కీలకంగా మారిన సంస్థలు పలు అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి కూడా బహిరంగ రహస్యమే. ఆరెస్సెస్ భావజాలం ఆధారంగా నడిచే బీజేపీ పార్టీకి.... ఆ పార్టీ నేతలకు రాజ్యాంగాన్ని మార్చాలన్న కోరిక ఉందని పలు ఘటనలు నిరూపించాయి. అయితే వివాదాస్పద ప్రకటనలు చేసే వారు మాత్రమే దీన్ని అంగీకరిస్తారు. ఇతర నేతలు గుంభనంగా ఉంటారు. అందుకే విపక్ష పార్టీలు బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాయంటూ ప్రజల్ని హెచ్చరిస్తూ ఉంటారు.
విఫలమైంది రాజ్యాంగమా ? రాజకీయ వ్యవస్థ ?
విఫలమైంది రాజ్యాంగమా లేక దాన్ని రాజకీయ నాయకత్వం విఫలమయ్యేట్లు చేసిందా అనే అంశంపై దేశవ్యాప్త విస్తృత చర్చ జరగాల్సిన సందర్భం వచ్చింది. రాజ్యాంగం అందరికీ అర్ధమవ్వాలి, ప్రజాస్వామ్యం అందరూ అనుభవించాలి, చట్ట సభల్లో సభ్యులు హుందాగా ప్రవర్తించాలి, మూడు స్థంభాలు మూలమై నిలిచి దేశ గౌరవాన్ని నిలుపాలి, సమాజంలోని ప్రజలందరికీ రాజ్యాంగం కల్పించిన హక్కులు సొంత మవ్వాలి. ఇవన్నీ వినటానికి బాగానే ఉంటాయి. ఆచరణ సాధ్యమా అన్నది ప్రధానమైన ప్రశ్న. రాజ్యాంగ హక్కులు సమగ్రంగా, సంపూర్ణంగా అందరూ అనుభవించిననాడే, ఆ స్ఫూర్తి, ఆ దీప్తి నిలబడుతుంది. సామాన్యుడికి రాజ్యాంగం తెలియడం వల్ల ఏ ఉపయోగం లేదు. అది అందిననాడే అసలు ప్రయోజనం నెరవేరుతుంది. కానీ అలాంటి పరిస్థితిని పాలకులు ఏర్పాటు చేయగలుగుతున్నారా అన్నదే అసలు సమస్య.