కేంద్రీయ విద్యాలయాల్లో ( KV  ) ఎంపీల కోటా కింద కేటాయిస్తున్న పది సీట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ( Central Governament ) నిర్ణయం తీసుకుంది.  లోక్‌సభ ఎంపీ తన నియోజకవర్గ పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో పది సీట్లను తాను కోరుకున్న వారికి ఇప్పించవచ్చు. రాజ్యసభ ఎంపీ ఎక్కడైనా ఇప్పించవచ్చు. అయితే ఇక నుంచి ఎంపీల కోటా కింద ఉన్న  ఈ పది సీట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నారు. కొంత కాలంగా ఎంపీల కోటాపై చర్చలు జరుగుతున్నాయి.  ఆ కోటాను ఎత్తివేయాల‌ని కొంద‌రు, ఆ కోటాను పెంచాల‌ని కొంద‌రు వాదిస్తూ వస్తున్నారు.


ఇటీవల లోక్‌సభలో ఈ అంశంపై చర్చ జరిగింది.  దీనిపై రాజ‌కీయ పార్టీల‌తో చ‌ర్చ నిర్వ‌హించాల‌ని విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్‌ను స్పీక‌ర్ ఓం బిర్లా ఆదేశించారు. కోటాలో ఎందుకు వివ‌క్ష ఉండాల‌ని స్పీక‌ర్ అన్నారు. కేంద్ర స్కూళ్ల‌లో 10 సీట్ల కోటా స‌రిపోదు అని, దాన్ని పెంచండి లేదంటే ర‌ద్దు చేయాల‌ని కాంగ్రెస్ ఎంపీ మ‌నీష్ తివారీ డిమాండ్ చేశారు. అయితే ఎంపీల కోటాను ర‌ద్దు చేసే యోచ‌న‌లో ఉన్నామని ఆ సందర్భంగా మంత్రి ప్రధాన్ ప్రకటించారు. ఇప్పుడు ఆ కోటాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎంపీల సిఫార్సులు మెరిట్ బేస్డ్‌గా ఉండటం లేదని దీని వల్ల ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతున్న కారణంగా రద్దు నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి తెలిపారు. 


దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 13 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.   ఎంపీ కోటాలో మాత్రమేకాకుండా ఇతర కోటాల ద్వారా కూడా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు పొందవచ్చు. స్పోర్ట్స్‌, జాతీయ అవార్డులు పొందిన ప్రతిభావంతులైన పిల్లలు, అలాగే మానవ వనరులు, అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కూడా ఈ పాఠశాలల్లో ప్రవేశాలు పొందడానికి కొన్ని కోటాలు అందుబాటులో ఉన్నాయి.  ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటాను కేంద్రం రద్దు చేసింది. మిగతా కోటాలు కొనసాగుతాయి.  


విద్యాశాఖ సమర్పించిన తాజా డేటా ప్రకారం.. దేశంలో మొత్తం 1245 కేంద్రీయ విద్యాలయాలున్నాయి.  ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 104 కేవీ పాఠశాలలున్నాయి. మధ్యప్రదేశ్‌లో 95 ఉండగా, రాజస్థాన్‌లో 68 కేంద్రీయ విద్యాలయాలున్నాయి.   ఒక తరగతిలోని మొత్తం 40 సీట్లలో.. 30 రిజర్వేషన్‌ సీట్లు, 10 జనరల్ సీట్లు ఉంటాయి.