Amritpal Singh News:


అప్రమత్తమైన పోలీసులు..


ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చినా అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. అయితే...ఆయన అనుచరులను మాత్రం అదుపులోకి తీసుకున్నారు. Waris Punjab De చీఫ్ అమృత్ పాల్‌ సింగ్‌కు సలహాదారుగా ఉన్న దల్జీత్ సింగ్ కల్సీని అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం అమృత్‌ను అరెస్ట్ చేయాలని పోలీసులు రంగం సిద్ధం చేసుకున్న వెంటనే పరారయ్యాడు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్న చోట ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎలాంటి అలజడులు రేగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నారు. జలంధర్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ కీలక ప్రకటన చేశారు. 


"వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ పరారీలో ఉన్నాడు. రెండు కార్లను స్వాధీనం చేసుకున్నాం. అతడి గన్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్నాం. ఇప్పటికే కేసు నమోదు చేశాం. పంజాబ్ పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. త్వరలోనే అరెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.  మొత్తం 78 మంది అనుచరులను అదుపులోకి తీసుకున్నాం. మరి కొన్ని చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి"


- కుల్దీప్ సింగ్ చాహల్, జలంధర్ కమిషనర్ 


భద్రత కట్టుదిట్టం..


రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడా అశాంతి వాతావరణం సృష్టించకుండా అప్రమత్తమయ్యారు. అటు కేంద్ర ఏజెన్సీలు కూడా ప్రజల్ని అప్రమత్తం చేశాయి. వదంతులను వ్యాప్తి చేయొద్దని సూచించాయి. పాకిస్థాన్‌ నుంచి కొందరు కావాలనే సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్ట్‌లు పెడుతున్నారని చెప్పింది. ఆ సమాచారాన్నినమ్మొద్దని తెలిపింది. ఖలిస్థాన్ మద్దతుదారులు ఇక్కడి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. అమృత్ పాల్‌ సింగ్‌ను అరెస్ట్ చేశామన్న వార్తల్ని నమ్మొద్దని, ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడని చెప్పింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పంజాబ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. 


ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేసిన నేపథ్యంలో పంజాబ్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా సహకరించాలని ప్రజల్ని కోరింది. ఎలాంటి వదంతులూ వ్యాప్తి చేయొద్దని సూచించింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేయకూడదని తెలిపింది. శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని ట్వీట్ చేసింది. కొద్ది వారాలుగా చురుగ్గా ఉద్యమం చేస్తున్నాడు అమృత్ పాల్ సింగ్. గత నెల ఖలిస్థాన్ మద్దతుదారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. అజ్నల పోలీస్‌ స్టేషన్ వద్ద పోలీసులు, ఉద్యమకారుల మధ్య తోపులాట జరిగింది. అమృత్ పాల్ సింగ్ అనుచరుడిని అరెస్ట్ చేయడంపై అలజడి సృష్టించారు. ఇప్పటికే ఆరుగురు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో అమృత్ యాక్టివ్‌గా ఉండడమే కాకుండా..తనను పోలీసులు వెంటాడుతున్నారంటూ వీడియోలు పోస్ట్ చేశాడు. 




Also Read: CBSE: అప్పటిదాకా స్కూల్స్ తెరవొద్దు, సీబీఎస్‌ఈ వార్నింగ్!