Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ విచారణపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కవిత పిటిషన్ పై ఈడీ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది.  మహిళా హక్కులను ఈడీ కాలరాస్తుందని కవిత తన పిటిషన్ లో కీలక అంశాలను ప్రస్తావించారు. తనను రాత్రి 8 గంటల వరకు ఈడీ కార్యాలయంలో కూర్చుండబెట్టడంపై సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సూర్యాస్తమయం తర్వాత మహిళను విచారణ కోసం కార్యాలయంలో కూర్చుండబెట్టకూడదని చట్టం చెబుతోందని కవిత తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే తమ వాదన వినేంతవరకు కవిత పిటిషన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఈడీ సుప్రీంకోర్టునుఅభ్యర్థించింది. ఒక మహిళను కార్యాలయానికి పిలిపించి విచారించకూడదని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 


సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్ 


దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇటీవల విచారించింది. అయితే ఈ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ కు కౌంటర్ గా ఈడీ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత కేసులో ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని అభ్యర్థించింది. తమ వాదన విన్న తర్వాతే ఏ నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. తమ వాదనలు వినకుండా ఈ పిటిషన్ పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేసింది. అయితే కవిత పిటిషన్ పై ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీతో పాటు కవిత తరపు వాదనలు కోర్టు విననుంది. ఈడీ తనను విచారణకు పిలవడాన్ని కవిత సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ 24న విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 


20న ఈడీ విచారణ 


దిల్లీ లిక్కర్ స్కామ్ లో  ఎమ్మెల్సీ కవితను ఈడీ ఈ నెల 11న విచారించింది. అయితే ఈ నెల 16న  మరోసారి విచారణకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆరోగ్య కారణాల దృష్ట్యా 16న విచారణకు కవిత గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఆమె తన లాయర్ తో ఈడీకి లేఖ పంపారు. అయితే దీనిపై స్పందించి ఈడీ ఈ నెల 20న విచారణకు రావాలని కవితకు నోటీసులు జారీ చేసింది. ఈడీ విచారణను సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసి కవిత... 20 తేదీలోపే తన పిటిషన్‌పై విచారణ జరపాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే కవిత పిటిషన్‌ను ముందుగా విచారణ చేయలేమని 24వ తేదీనే విచారిస్తామని  సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ విషయంలో మహిళనైన తన పట్ల ఈడీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ కవిత లేఖ రాశారు. తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో  ఎక్కడా పేర్కొనలేదన్నారు. దర్యాప్తు చట్టప్రకారం జరగడంలేదనే అనుమానం కలుగుతుందని కవిత విమర్శించారు. సుప్రీంకోర్టులో ఈ నెల 24న తన పిటిషన్ విచారణ చేసే వరకూ ఆగాలని ఈడీని కోరారు. అయితే అందుకు ఈడీ ఒప్పుకోలేదు. ఈ నెల 20న విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ తరుణంలో కవిత ఈ నెల 20న ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? సందిగ్ధం నెలకొంది.