Amicus Curiae: ప్రజాప్రతినిధుల కేసులను మొదట విచారించిన తర్వాత మిగతా కేసులను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టుకు అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా తాజాగా సిఫార్సు చేశారు. ప్రజాప్రతినిధులపై దాఖలైన పలు క్రిమినల్ కేసులు ఐదేళ్లకు పైబడి పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీం కోర్టుకు తాజాగా నివేదించారు. కింది కోర్టుల్లో మొదట ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు విచారించి.. ఆ తర్వాతే మిగతా కేసులను విచారణకు స్వీకరించేలా సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలని సిఫార్సు చేశారు. ముందుగా సిటింగ్ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణ చేపట్టాలని అన్నారు. 


ప్రజాప్రతినిధులపై కేసుల్లో వేగంగా విచారణ చేపట్టాలని కోరుతూ బీజేపీ నాయకుడు, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ పిల్ దాఖలు చేశారు. ఆ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణలో భాగంగా సుప్రీం కోర్టు విజయ్ హన్సారియాను అమికస్ క్యూరీగా నియమించింది. ఈ సందర్భంలో హన్సారియా సుప్రీం కోర్టుకు సిఫార్సులు చేశారు. 40 పేజీలతో కూడిన నివేదికను సమర్పించారు. సీబీఐ, ఈడీ కేసుల పర్యవేక్షణ కోసం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని అమికస్ క్యూరీ సిఫార్సు చేశారు. ప్రజాప్రతినిధులపై నమోదు అయిన కేసుల వివరాలను 16 హైకోర్టులు మాత్రమే పంపాయని, 9 హైకోర్టులు పంపలేదని వెల్లడించారు. వివరాలు పంపని హైకోర్టుల జాబితాలో తెలంగాణ హైకోర్టు కూడా ఉండటం గమనార్హం.


ప్రజాప్రతినిధుల కేసులు వేగంగా చేయాలంటూ అమికస్ క్యూరీ చేసిన సిఫార్సులు



  • ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను విచారిస్తున్న కోర్టులు ముందుగా ఆయా కేసులపైనే విచారణ సాగించాలి. అవి పూర్తి అయిన తర్వాతే మిగతా కేసులను విచారణకు స్వీకరించాలి. సీఆర్పీసీ సెక్షన్ 309 ప్రకారం రోజువారీగా ట్రయల్ నిర్వహించాలి. పని విభజనను హైకోర్టు లేదా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జీలు రెండు వారాల్లో పూర్తి చేయాలి. 

  • ప్రజాప్రతినిధుల కేసుల్లో వాయిదాలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే అందుకు దారి తీసిన కారణాలను ఎట్టిపరిస్థితుల్లో నమోదు చేయాల్సిందే.

  • ప్రజాప్రతినిధుల కేసులు వాయిదా పడకుండా త్వరితగతిన విచారణ పూర్తి అయ్యేలా ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదులు సహకరించాల్సి ఉంటుంది.

  • కేసుల విచారణ కోసం సంబంధిత జిల్లా సెషన్స్ జడ్జీతో సంప్రదించి రాష్ట్ర సర్కారు ప్రతి ప్రత్యేక కోర్టులో కనీసం ఇద్దరు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలి. 

  • ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగంగా జరగడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహకరించకపోతే దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం కోర్టు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలి. దానిపై నివేదిక కూడా ఇవ్వాలని ఆదేశించాలి. 

  • కేసుల్లో నిందితులగా ఉన్న వారే విచారణ జాప్యానికి కారణం అయితే వారి బెయిల్ రద్దు చేయాలి.

  • సిట్టింగ్ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణను మొదట చేపట్టాలి.

  • ప్రత్యేక కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలను లేబొరేటరీలు మొదటగా అందించాలి. 

  • సాక్షుల విచారణ, నిందితుల హాజరుకు కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ఉపయోగించుకోవాలి.

  • సాక్షులను సమన్లు జారీ చేసి కోర్టు ముందు హాజరయ్యేలా చూసే బాధ్యతలనూ ఎస్ హెచ్ఓలకు అప్పగించాలి. నిందితులు, సాక్షులను కోర్టు ముందు హాజరుపరచడంలో విఫలమైతే కోర్టులు నివేదిక కోరాలి.

  • ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను విచారిస్తున్న కోర్టులు ముందుగా ఆయా కేసులపైనే విచారణ సాగించాలి. అవి పూర్తి అయిన తర్వాతే మిగతా కేసులను విచారణకు స్వీకరించాలి. సీఆర్పీసీ సెక్షన్ 309 ప్రకారం రోజువారీగా ట్రయల్ నిర్వహించాలి. పని విభజనను హైకోర్టు లేదా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జీలు రెండు వారాల్లో పూర్తి చేయాలి. 

  • పెండింగ్ లో ఉన్న ఈడీ, సీబీఐ కేసుల పర్యవేక్షణకు సుప్రీం కోర్టు మాజీ జడ్జీ లేదంటే హైకోర్టు మాజీ సీజే ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ పర్యవేక్షక కమిటీలో ఈడీ డైరెక్టర్, సీబీఐ డైరెక్టర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శులను లేదా, వారు నియమించిన అధికారులకు బాధ్యతలు అప్పగించాలి.