Bike Helmets in Black Colour: వాహనదారుల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ కల్పించే బైక్ హెల్మెట్లు. అయితే ఈ హెల్మెట్లు చాలా వ‌ర‌కు న‌ల్ల‌గా ఉండ‌డాన్ని మీరు గ‌మ‌నించే ఉంటారు. కొన్ని కంపెనీలు హెల్మెట్ ప్రాధాన్యతను తెలిపేందుకు బైక్ స్టార్ట్ చేయడానికి రైడర్ హెల్మెట్ ధరించి ఉండేలా రూపొందిస్తున్నాయి. అస‌లు హెల్మ్‌ట్‌ను న‌ల్ల రంగులో ఎందుకు త‌యారుచేస్తారో ఆ విషయాలపై ఓ లుక్కేయండి.


ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌ ప్రాణాలకు హెల్మెట్ ర‌క్ష‌ణ కల్పిస్తుంది. రోడ్డు ప్ర‌మాదాల నుంచి హెల్మెట్‌ మ‌న‌ల్ని ర‌క్షిస్తుంది. రోడ్డు ప్ర‌మాదాల మృతుల్లో ఎక్కువ మంది త‌ల‌కు తీవ్ర గాయాలు కావ‌డం వ‌ల్లే మ‌ర‌ణిస్తున్నారని పలు నివేదికల్లో వెల్లడైంది. అంతేకాదు ట్రాఫిక్ పోలీసుల జ‌రిమానా సమస్య బారిన పడకుండా ఉండవచ్చు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2021 నివేదిక ప్రకారం.. 46,593 మంది హెల్మెట్ ధరించని కారణంగా రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. ఆ ఏడాది మొత్తం 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే, 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6 శాతం పెరిగాయి. ఈ ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య 16.9 శాతం పెరిగింది.  అయితే మనం హెల్మెట్ ఉపయోగం గురించి కాకుండా దాని నలుపు రంగు గురించి తెలుసుకుందాం.


హెల్మెట్‌ను బ్లాక్ కలర్ లో ఎందుకు త‌యారు చేస్తారు?
హెల్మెట్‌ను న‌లుపు రంగులో త‌యారు చేయ‌డం వెనుక కార‌ణం సైన్స్ కంటే వాటిని త‌యారు చేసే కంపెనీల లాభ‌మే అధికం. వాస్త‌వానికి, హెల్మెట్‌ను త‌యారు చేసేందుకు కంపెనీలు వినియోగించే ప్లాస్టిక్ లేదా ఫైబ‌ర్ గ్లాస్ న‌లుపు రంగులో ఉంటాయి. వీటిని త‌యారు చేసే క్ర‌మంలో ఇత‌ర ర‌కాల ద్ర‌వ్యాల‌ను జోడించిన‌ప్పుడు, మొత్తం మిశ్ర‌మం రంగు న‌ల్ల‌గా మారుతుంది. కంపెనీలు తమ డబ్బును ఆదా చేసుకునేందుకు ఈ కలర్ ద్రవ్యంతో హెల్మెట్‌లను తయారు చేస్తాయి.


మ‌రోవైపు ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో న‌లుపు రంగుకు ప్ర‌త్యేక స్థానం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కూడా కంపెనీలు హెల్మెట్లను న‌లుపు రంగులో త‌యారు చేస్తాయ‌ని కొంద‌రి వాద‌న‌. నలుపు రంగు అన్ని రకాల దుస్తులు, ద్విచ‌క్ర వాహ‌నాల రంగుకు సెట్ అవుతుంది. అందుకే కంపెనీలు న‌ల్ల రంగు హెల్మెట్‌లను ఎక్కువగా తయారు చేస్తున్నాయి. అంతేకాకుండా మ‌న జుట్టు రంగు న‌ల్ల‌గా ఉండ‌డం వ‌ల్ల న‌లుపు రంగు హెల్మెట్ ధ‌రించిన‌ప్పుడు, అది భిన్నంగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు చాలా ద్విచ‌క్ర వాహ‌న కంపెనీలు త‌మ బైక్‌ల రంగుకు స‌రిపోయే హెల్మెట్ లను త‌యారు చేస్తున్నాయి. యువ‌త కూడా వాటిని విప‌రీతంగా ఇష్ట‌ప‌డుతున్నారు.


వేర్వేరు రంగుల హెల్మెట్‌లు, అవి ఎవరు ధరిస్తారో తెలుసా?
 
- తెలుపు రంగు: తెలుపు రంగు హెల్మెట్ ను ఎక్కువ‌గా ప‌ర్య‌వేక్ష‌ణ స్థాయిలో ఉన్న‌వారు ధ‌రిస్తారు. మేనేజ‌ర్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, సూపర్‌వైజ‌ర్లు ధ‌రిస్తారు. 


- ఆకుప‌చ్చ రంగు: ఈ రంగును ఎక్కువ‌గా సైట్ ర‌క్ష‌ణాధికారులు, ఇన్‌స్పెక్ట‌ర్లు ధ‌రిస్తారు. అలాగే కొత్త‌గా నియ‌మితులైన వారు, శిక్ష‌ణ పొందుతున్న వారు కూడా వీటిని ధ‌రిస్తారు. 


- ప‌సుపు రంగు: ఈ రంగు హెల్మెట్లను భారీ యంత్రాల‌ను ఆప‌రేట్ చేసే కార్మికులు, మ‌ట్టి త‌వ్వ‌కాలు చేసేవారు, భ‌వ‌న నిర్మాణ కార్మికులు ధ‌రిస్తారు.


- గోధుమ రంగు: ఈ రంగును వెల్డింగ్‌, అధిక వేడి వ‌ద్ద ప‌నిచేసే ఉద్యోగులు ఉప‌యోగిస్తారు. 


- నారింజ రంగు: నారింజ రంగును గుర్తించ‌డం సుల‌భం. అందువ‌ల్ల ఈ రంగును రోడ్డు నిర్మాణ కార్మికులు ఉప‌యోగిస్తారు. అలాగే కొత్త‌గా నియ‌మితులైన వారికి, సైట్ విజిట‌ర్స్‌కు కూడా ఇస్తారు. 


- నీలం రంగు: ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు సాధారణంగా ఈ కలర్ కోడ్ హెల్మెట్‌ను వినియోగిస్తారు. తాత్కాలిక ఉద్యోగులు, సాంకేతిక సలహాదారులు కూడా వీటిని ధ‌రిస్తారు. 


- ఎరుపు రంగు: అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర శిక్షణలో ఉన్న‌ ఇతర ఉద్యోగులు దీనిని ఉపయోగిస్తారు.


- బూడిద రంగు: దీనిని వర్క్‌సైట్‌లోని సందర్శకులు వినియోగిస్తారు. 


- గులాబీ రంగు:  ఈ రంగు మహిళా కార్మికులలో బాగా ప్రాచుర్యం పొందింది. కొన్ని కంపెనీలలో కార్మికులు తమ హెల్మెట్‌ను ఇంట్లో మరచిపోయినట్లయితే పింక్ హెల్మెట్‌లను అందుబాటులో ఉంచుతారు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial