Delhi Man: ఆన్‌లైన్‌ లో ఆర్డర్ పెడితే ఎలాంటి ఐటెమ్స్ అయినా ఇట్టే ఇంటికి వచ్చేస్తుంటాయి. పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఉదయం ఆర్డర్ చేస్తే సాయంత్రానికి ఇంటికి వస్తాయి. చాలా వరకు ఆర్డర్లు వారం లోపు వచ్చేస్తుంటాయి. అయితే మన అదృష్టం బాగా పెరిగిపోతే మాత్రం నెల రోజులు కూడా పట్టొచ్చు. కొన్ని అత్యంత అరుదైన సందర్భాల్లో సంవత్సరాల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. మరీ.. సంవత్సరం ఎవరు ఎదురుచూస్తారు, లైట్ తీసుకుంటారు, ఆర్డర్ క్యాన్సిల్ చేసేస్తుంటారు అని అనుకోవచ్చు. అది కూడా నిజమే. అయితే దిల్లీకి చెందిన ఓ వ్యక్తికి ఆ ఆప్షన్ లేకుండా పోయింది. ఎందుకుంటే అతను నాలుగేళ్ల క్రితం అలీ ఎక్స్‌ప్రెస్‌ అనే ఈ-కామర్స్ సైట్ లో ఓ ఐటెం ఆర్డర్ పెట్టాడు. తర్వాత అలీ ఎక్స్‌ప్రెస్ ను ఇండియాలో బ్యాన్ చేసేసారు. తను చేసిన ఆర్డర్ ఏమో తన వద్దకు రాలేదు. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలు కూడా మారాయి. ఇక ఆర్డర్ రాదని లైట్ తీసుకున్నాడు ఆ వ్యక్తి. అయితే తాజాగా అతడికి షాక్ తగిలింది. తనకు జరిగిన సంఘటనను ట్విట్టర్ లో పంచుకోగా.. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. 


దిల్లీకి చెందిన టెక్కీ, నితిన్ అగర్వాల్ తాజాగా తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఓ పోస్టు పెట్టాడు. ఆ ట్వీట్ కు 'ఎప్పటికీ ఆశ కోల్పోవద్దు! కాగా, నేను దీన్ని 2019లో అలీ ఎక్స్‌ప్రెస్‌(ప్రస్తుతం భారత్‌లో బ్యాన్ అయింది) నుంచి ఆర్డర్ చేశాను. ఈ రోజు ఆ పార్శిల్ డెలివరీ అయింది' అనే క్యాప్షన్ ఇచ్చాడు. తనకు వచ్చిన పార్శిల్ ఫోటోను కూడా పంచుకున్నాడు నితిన్ అగర్వాల్. ఆ పార్శిల్ పై చైనీస్ అక్షరాల్లో ఏదో రాసి ఉంది. అలాగే 2019.05.23.20 అనే తేదీ కూడా ఉంది.  నితిన్ అగర్వాల్ అలీ ఎక్స్‌ప్రెస్ నుంచి 2019 లో ఓ ఐటెమ్ ఆర్డర్ చేశాడు. నాలుగేళ్ల తర్వాత ఆ ఆర్డర్ ఇప్పుడు అతని చేతికి వచ్చింది. అయితే 2020 లో భద్రతా సమస్యల కారణంగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన యాప్స్ జాబితాలో ఈ యాప్ కూడా ఉంది. 


Also Read: Assam Floods: అస్సాంలో వరద బీభత్సం, సుమారు 5 లక్షల మందిపై తీవ్ర ప్రభావం


నితిన్ అగర్వాల్ తనకు జరిగిన సంఘటన గురించి ఫోటోతో కూడిన ట్వీట్ పోస్టు చేయగానే.. అది కాస్త వైరల్ గా మారింది.  చాలా మంది నెటిజన్లు ఈ పోస్టుపై కామెంట్లు చేస్తున్నారు. 'నేనూ నీఅంత అదృష్టవంతుడిని కావాలని కోరుకుంటున్నా' అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. 'నాక్కూడా 8 నెలల తర్వాత అలీ ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్ అందింది' అని మరో యూజర్ కామెంట్ లో పేర్కొన్నాడు. 'నేను నా సొంత దేశానికి చెందిన ఆన్‌లైన్ స్టోర్ లో చేసిన ఆర్డర్.. నాకు 6.5 సంవత్సరాల తర్వాత అందింది' అని మరొకరు కామెంట్ చేశారు. 














Join Us on Telegram: https://t.me/abpdesamofficial