Air India Official: 



సిడ్నీ ఢిల్లీ ఫ్లైట్‌లో ఘటన..


సిడ్నీ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్యాసింజర్ ఫ్లైట్ సిబ్బందిపై చేయి చేసుకున్నాడు. ఓ సీనియర్ అధికారిని దూషించడమే కాకుండా చెంప దెబ్బ కొట్టాడు. జులై 9వ తేదీనే ఈ ఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌ ఇండియాకి చెందిన సీనియర్ అఫీషియల్ బిజినెస్ క్లాస్‌ సీట్ బుక్ చేసుకున్నాడు. అయితే...ఆ సీట్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఎకానమీ క్లాస్‌కి మారాడు. అప్పుడే మొదలైంది గొడవ. ఎకానమీ క్లాస్‌లో ఉన్న ఓ ప్రయాణికుడు అందరితోనూ చాలా ర్యాష్‌గా మాట్లాడుతున్నాడు. వాయిస్ పెంచి మాట్లాడటం వల్ల మిగతా ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు. "కాస్త నెమ్మదిగా మాట్లాడండి" అని ఆ అధికారి ప్యాసింజర్‌ని వారించాడు. అంతే..వెంటనే కోపంతో ఊగిపోయి వచ్చి ఆ అధికారిని కొట్టాడు ప్రయాణికుడు. తలను గట్టిగా పట్టుకుని తిప్పాడు. ఇష్టమొచ్చిన బూతులు తిట్టాడు. సిబ్బంది మొత్తం వచ్చి ప్యాసింజర్‌ని కంట్రోల్ చేయాలని చూసినా అది వల్ల కాలేదు. చేసేదేమీ లేక ఆ అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయి వేరే చోట కూర్చున్నాడు. దీనిపై ఎయిర్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. Directorate General of Civil Aviation (DGCA)కి ఈ ఘటనను వివరించింది. 


"సిడ్నీ ఢిల్లీ ఫ్లైట్‌లో జులై 9వ తేదీన ఓ ప్రయాణికుడు ఎయిర్ ఇండియా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. ఓ అధికారిని కొట్టడమే కాకుండా దూషించాడు. మిగతా ప్రయాణికులకు ఇది ఎంతో అసౌకర్యం కలిగించింది. ఢిల్లీలో ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే అక్కడి సెక్యూరిటీ ఏజెన్సీకి నిందితుడిని అప్పగించాం. డీజీసీఏ దృష్టికి తీసుకెళ్లాం. ఇలా ఫ్లైట్‌లో అనుచితంగా ప్రవర్తించే వారిని ఎయిర్ ఇండియా అస్సలు సహించదు. చట్టప్రకారం తీసుకోవాల్సిన చర్యల్ని కచ్చితంగా తీసుకుంటాం"


- ఎయిర్ ఇండియా ప్రతినిధి 


ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌లలో రోజుకో గొడవ జరుగుతోంది. ప్రయాణికులు గొడవ పడడమో, ఫుల్‌గా తాగేసి రచ్చ చేయడమో లాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడలాంటి ఘటనే మరోటి జరిగింది. ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్తున్న ఫ్లైట్‌లో ఓ ప్యాసింజర్ విమాన సిబ్బందితో గొడవకు దిగాడు. టేకాఫ్‌ అయిన కాసేపటికే ఈ గొడవ మొదలైంది. చేసేదేమీ లేక వెంటనే మళ్లీ ఢిల్లీలో ల్యాండ్ చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు Air India యాజమాన్యం ఆ ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 10వ తేదీన ఢిల్లీ నుంచి విమానం బయల్దేరింది. కాసేపటికే ప్యాసింజర్‌కి, సిబ్బంది మధ్య గొడవైంది. వెంటనే ఢిల్లీకి తిరుగు పయనమైంది ఫ్లైట్. సిబ్బంది ఆ ప్యాసింజర్‌ను పోలీసులకు అప్పగించి మళ్లీ లండన్‌కు బయల్దేరింది. 


"ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 111 ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ ఉన్నట్టుండి గొడవ మొదలవడం వల్ల మళ్లీ ఢిల్లీలో ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. ఆ ప్యాసింజర్‌ మా మాట వినలేదు. మేం ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఊరుకోలేదు. అనుచితంగా ప్రవర్తించాడు. నోటికొచ్చినట్టు మాట్లాడాడు. మా సిబ్బందిపై చేయి కూడా చేసుకున్నాడు. అందుకే పైలట్‌ వెంటనే ఢిల్లీకి ఫైట్‌ని మళ్లించాడు"


- ఎయిర్ ఇండియా యాజమాన్యం


Also Read: Monsoon 2023 Deaths: 624 మందిని బలి తీసుకున్న వానలు, అత్యధికంగా ఆ రాష్ట్రంలోనే