ABP-CVoter Poll: చంద్రయాన్ 3తో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ దృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అలాగే చంద్రుడిపై దిగిన నాలుగో దేశంగా నిలిచింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. చంద్రయాన్ సక్సెస్ భారత్ కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేసింది. అయితే దేశంలో మాత్రం రాజకీయ వేడిని రేపింది.


చంద్రయాన్ విజయవంతానికి తాము కారణమంటే కాదు తామేనంటూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ కోసం పోటీ పడ్డాయి. ఈ నేపథ్యంలో ABP న్యూస్, CVoterతో కలిసి స్నాప్ పోల్ నిర్వహించింది. రాజకీయాలకు కారణమైన చంద్రయాన్ 3 విజయంపై ఎవరికి క్రెడిట్ దక్కాలనే అంశంపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ఎవరికి మద్దతు ఇస్తారంటూ ప్రజల అభిప్రాయలు సేకరిస్తూ ఒక స్నాప్ పోల్ నిర్వహించింది.


చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతం కావడాన్ని సైతం రాజకీయాలుగా మార్చుకున్నాయి పొలిటికల్ పార్టీలు. భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కాలంలో సైన్స్ శాస్త్రీయ ఆలోచనను ప్రోత్సహించడంపై ఈ రోజు చంద్రయాన్ విజయవంతమైందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. అలాగే బీజేపీ సైతం ఆ విజయాన్ని తమ ఖాతాల్లో వేసుకునేందుకు యత్నించింది. ఆ క్రెడిట్ అంతా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని వాదించింది. ఈ నేపథ్యంలో ABP న్యూస్, CVoterతో కలిసి, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చారిత్రాత్మక విజయం క్రెడిట్ ఎవరికి దక్కాలని వారు భావిస్తున్నారనే అంశంపై ప్రజల మనోభావాలను తెలుసుకోవడానికి ఒక స్నాప్ పోల్ నిర్వహించింది.


నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) మద్దతుదారుల్లో ఎక్కువ మంది ప్రధాని మోదీకి అనుకూలంగా చెప్పారు. 35.5% మంది ప్రధాన మంత్రి మోదీకే చంద్రయాన్ సక్సెస్ క్రెడిట్ దక్కుతుందన్నారు. 5.4% మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీ లేదా జవహర్ లాల్ నెహ్రూకు దక్కుతుందని అభిప్రాయపడ్డారు. 3.9% మంది ఇరు పార్టీలకు క్రెడిట్ ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఎక్కువగా 53.9% మంది శాస్త్రవేత్తలకు చంద్రయాన్ 3 క్రెడిట్ ఇచ్చారు. వారు మాత్రమే ప్రశంసలకు అర్హులని పేర్కొన్నారు. మరో 1.3% మంది ఈ విషయంపై ఎటు తేల్చలేకపోయారు. 


ప్రతిపక్ష మద్దతుదారుల్లో సైతం ప్రధాని మోదీకి 21.9% మంది క్రెడిట్‌ ఇచ్చారు. 10.5% మంది నెహ్రూకి మద్దతు తెలిపారు. 5.5% మంది ఇద్దరు నాయకులకు ఆ అర్హత ఉందన్నారు. 60.3% మంది మాత్రం చంద్రయాన్ మిషన్ విజయవంతానికి వెనుక ఉన్న శాస్త్రవేత్తలకు మాత్రమే క్రెడిట్ దక్కాలని నొక్కి చెప్పారు. 1.8% మందితో ఏ విషయంలో అనిశ్చితంగా ఉన్నామని, తాము ఏ అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేదని చెప్పారు. 


అలాగే చంద్రయాన్-3 విజయానికి క్రెడిట్ తీసుకోవడానికి చేస్తున్న రాజకీయాలు సరైనవా కాదా అని ఎన్డీఏ మద్దతుదారుల్లోని ప్రజలను అడిగారు. అందులో 54.1% మంది క్రెడిట్ రాజకీయాలు అన్యాయమని అభిప్రాయపడ్డారు. అయితే 29.5% మంది క్రెడిట్ తీసుకునే ప్రయత్నాలు సరైనవే అని వాదించారు. మిగిలిన 16.4% మంది దీనిపై అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేదన్నారు. ప్రతిపక్ష మద్దతుదారుల్లో సైతం 59.8% మంది చంద్రయాన్ విజయాన్ని రాజకీయం చేయడాన్ని తప్పుడు చర్యగా భావిస్తున్నారు. 21.5% మంది రాజకీయాలను సమర్థించారు. దాదాపు 18.7% మంది అభిప్రాయాన్ని చెప్పలేదు.