Atishi As New CM Of Delhi: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ నేత, మంత్రి ఆతిషీ (Atishi) ఎన్నికయ్యారు. ఆప్ ఎమ్మెల్యేలు ఆమెను సీఎంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆప్ శాసనసభాపక్షం సమావేశంలో కేజ్రీవాల్ (Kejriwal) ప్రతిపాదనకు ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఆతిషీ.. ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కాగా, మంగళవారం సాయంత్రం తన పదవికి సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన కేజ్రీవాల్‌కు తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన అనంతరం తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఆదివారం ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం 04:30 గంటలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాను కలిసి కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను సమర్పిస్తారు. కొత్త సీఎం ఎంపికపై పార్టీ అగ్రనేతలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఆతిషీని సీఎంగా ఎన్నుకున్నారు. అంతకు ముందు కేజ్రీవాల్ సతీమణి సునీత, మంత్రులు గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లోత్, సౌరభ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ పేర్లు సీఎం రేసులో వినిపించాయి. సీనియర్ నేతల అభిప్రాయాల మేరకు ఆతిషీవైపే కేజ్రీవాల్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు.






ఆ సంచలన ప్రకటనతో..


ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఇటీవల సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలతో బెయిల్ ఇచ్చింది. కేసు గురించి క్కడా బహిరంగ వ్యాఖ్యలు చెయ్యొద్దని స్పష్టం చేసింది. సీఎం కార్యాలయానికి వెళ్లొద్దని.. ఎలాంటి అధికారిక ఫైళ్లపై సంతకాలు సైతం చెయ్యొద్దని పేర్కొంది. సుప్రీం తీర్పుతో జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్.. తన పదవికి రాజీనామా చేస్తానంటూ ఆదివారం కీలక ప్రకటన చేశారు. ప్రజలు తనకు సర్టిఫికెట్ ఇచ్చేంతవరకూ సీఎం పదవిలో ఉండనని స్పష్టం చేశారు. మధ్యంతర ఎన్నికలకు వెళ్లి తన విశ్వసనీయతను పరీక్షించుకుంటానని చెప్పారు.


సీఎంగా ఆతిషీ ప్రమాణస్వీకారం ఎప్పుడంటే?


ఈ నెల 26, 27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల్లోనే ఆతిషీ (Atishi) సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. అయితే, ఈసారి డిప్యూటీ సీఎంగా ఎవరినీ ప్రకటించే ఛాన్స్ లేనట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, నవంబర్‌లోనే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం మాత్రం ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.


Also Read: RG Kar Corruption Case: టీఎంసీ మెడకు ఆర్‌జీకర్ కేసు- ఎమ్‌ఎల్‌ఏ సుదీప్తో రాయ్‌ నివాసంలో సీబీఐ సోదాలు