CBI Raids In TMC MLA House: కోల్‌కత ఆర్జీకర్ హాస్పిటల్ హత్యోదంతం కేసులో మంగళవారం (సెప్టెంబర్‌ 17) నాడు సుప్రీం కోర్టులో హియరింగ్ ఉన్నవేళ.. కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐ దూకుడు పెంచింది. ఆర్‌జీకర్ కరప్షన్ కేసుకు సంబంధించి కోల్‌కతలోని ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఆరింటిలో ఒకటి అధికార టీఎంసీ ఎమ్‌ఎల్‌ఏ సుదీప్తో రాయ్‌ నివాసం కూడా ఉంది. సీబీఐ దూకుడు అధికార పక్షానికి ఇబ్బందిగా మారింది. జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిగి 24 గంటలు కూడా గడవక ముందే సీబీఐ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆర్జీకర్ ఆస్పత్రి రోగుల వెల్‌ఫేర్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్న సుదీప్తో రాయ్ నివాసం సహా.. సింధీలోని నర్సింగ్‌ హోమ్‌లో జరుగుతున్న సీబీఐ దాడులతో విపక్షాలు దీదీ సర్కార్‌ను మరింత ఇరుకున పెట్టేందుకు అస్త్రాలు దొరికినట్లైంది. కొద్ది రోజుల క్రితం తమకు అందిన లీడ్స్‌తో సుదీప్తో రాయ్‌ ఇంటికి వెళ్లి ఆయనను ఆర్‌జీకర్ కరప్షన్ కేసులో సీబీఐ అధికారులు విచారించగా.. తాను అధికారులకు పూర్తిగా సహకరిస్తానని సుదీప్తో వెల్లడించారు.



రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కూడా :


బాలీగంజ్ సర్కిల్‌ రోడ్‌లో ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగి సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడున్న మెడిసిన్ అండ్ డ్రగ్స్ వ్యాపారి సందీప్‌ జైన్ ఇంట్లో తనిఖీలు జరుగుతున్నాయి.  ఇంతకు ముందు కూడా ఈడీ ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ఘోష్‌కు చెందిన చినార్ పార్క్‌ హౌస్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. సందీప్‌ ఘోష్ తల్లిదండ్రులను కూడా పిలిపించి వారిని అధికారులు విచారించారు. సందీప్‌ ఘోష్‌కు అత్యంత సన్నిహితుడుకి చెందిన చందన్‌ లౌహా నివాసంలో కూడా ఈడీ సోదాలు చేపట్టింది. అతడికి సంబంధించిన ది మెడికల్ ఎక్విప్‌మెంట్‌ సప్లయర్స్ కార్యాలయంలోనూ సోదాలు జరిగాయి. అటు.. ఆర్జీకర్‌ కేసులో జూనియర్ వైద్యులు డిమాండ్‌కు అనుగుణంగా కోల్‌కత కమిషనర్‌ను తప్పించిన మమత.. మంగళవారం సాయంత్రం లోగా కొత్త పోలీసు కమిషనర్‌ను నియమించనున్నారు.


 ఆగస్టు 9న ఆర్జీకర్ ఆస్పత్రిలో గడచిన 39 గంటలుగా డ్యూటీ చేసి నాలుగో అంతస్తులోని సెమినార్‌ హాల్‌లో దారుణ రేప్‌, హత్యాచారానికి గురైన స్థితిలో శవమై జూనియర్ వైద్యురాలు కనిపించడం సంచలనం రేపింది. ఆ కేసును చిన్నదిగా చేసి చూపించడమే లక్ష్యంగా నాటి ఆర్జీకర్ ఆస్పత్రి కళాశాల ప్రిన్సిపల్ ప్రయత్నించగా అతడికి కొందరు పోలీసు అధికారులు, లాయర్లు సహకరించారు. ఈ క్రమంలో పోస్టు మార్టం చేస్తున్న వైద్యుడికి కూడా లంచం ఇవ్వబోయారన్న వార్త సంచలనం రేకెత్తించింది. ఈ క్రమంలో దర్యాప్తు సీబీఐకి బదిలీ అవగా.. వాళ్లు కీలక సాక్ష్యాలను సేకరించి.. ఈ ఘటనలో ఉన్న నిందితులు అందరినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఆర్జీకర్ ఆస్పత్రి పరిధిలోకి వచ్చే తల పోలీసు స్టేషన్‌ ఇన్వెస్టిగేటింగ్ అధికారిని కూడా అరెస్టు చేసిన సీబీఐ.. కళాశాల ప్రిన్సిపల్ ఆదేశాలు అనుగుణంగానే అతడు వ్యవహరించినట్లు దర్యాప్తులో తేల్చారు. ఇప్పటికే ఈ కేసులో పెద్ద పెద్ద వ్యక్తులు అందరూ అరెస్టు గురవుతుండడం.. సీనియర్ అధికారులపై సర్కారు తప్పని సరి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవడం.. సుదీప్తో రాయ్ ఇంట్లో సోదాలు తదితర అంశాలు.. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి.


Also Read: ఆర్జీకర్ రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసులో మమత సంచలన ఆదేశాలు.. పోలీసు కమిషనర్‌ సహా టాప్ వైద్యాధికారులపై చర్యలు