Cyber Scams with Name Of Ram Mandir : సులభ మార్గాల్లో డబ్బు సంపాదించాలన్న కోరిక మోసాలకు పాల్పడేలా చేస్తోంది. ఈ మధ్య కాలంలో తప్పుడు మార్గాల్లో ప్రజల డబ్బు కాజేస్తున్న మోసగాళ్ల సంఖ్య పెరిగింది. మోసానికి కాదేది అనర్హం అన్నట్టుగా సైబర్ మోసగాళ్లు రెచ్చి పోతున్నారు. స్పెషల్ ఆఫర్లు.. వోచర్లు.. ఓటీపీ పేర్లు చెప్పి మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు.. ప్రస్తుతం శ్రీరాముడి భక్తులను లక్ష్యంగా చేసుకొని డబ్బులు కాజేసే ప్రయత్నాలను సాగిస్తున్నారు.
ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ వేడుకను కనులారా చూసేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే ఈ వేడుకకు అతి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం అందడంతో చాలామంది నిరుత్సాహంలో ఉన్నారు. ఈ వేడుకను నేరుగా తిలకించాలన్న కోరికతో ఉన్న భక్తులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇందుకోసం నకిలీ టికెట్ల పేరుతో దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మెసేజ్‌లు పంపుతూ డబ్బు కొల్లగొట్టే ప్రయత్నం..
ఈ నెల 22న అయోధ్యలో జరగనున్న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన వీఐపీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి.. వీటిని మీకోసం అందిస్తున్నాం అంటూ పలువురు సైబర్ నేరగాళ్లు భక్తులకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఈ మెసేజ్లను క్లిక్ చేసిన వారి ఖాతాలో నుంచి క్షణాల్లోనే డబ్బులు కొల్లగొట్టేలా సైబర్ నేరగాళ్లు వ్యూహరచన చేస్తున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఎన్నుకున్న సరికొత్త మార్గంగా దీన్ని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇది మెసేజ్ సారాంశం..
భక్తులకు సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న మెసేజులు కూడా నమ్మదగిన విధంగానే కనిపిస్తున్నాయి. దీంతో వందలాది మంది భక్తులు మోసపోతున్నారు. 'రామ జన్మభూమి గృహ సంపర్క్ అభియాన్.. APK' అని లేబుల్ చేసిన ఫైల్ ఉంటోంది. రెండో మెసేజ్ లో 'రామ జన్మభూమి గృహ సంపర్క్ అభియాన్ ను ఇన్స్టాల్ చేసుకోండి.. వీఐపీ యాక్సెస్ పొందేందుకు హిందువులతో షేర్ చేసుకోండి జైశ్రీరామ్' అని ఉంది.
స్కామ్ జరిగేది ఇలా..
భక్తులకు వస్తున్న ఇటువంటి మెసేజ్ లకు, ప్రచారానికి ప్రభుత్వాలకు, ఆలయ నిర్వాహకులకు, ట్రస్టుకు గాని సంబంధం లేదు. రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలని భావిస్తున్న భక్తులను లక్ష్యంగా చేసుకొని నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. APK ఫైల్స్ డౌన్లోడ్ చేస్తే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి నుంచి ఎదురయ్యే రిస్కు, అందులో దాగివున్న స్పెసిఫిక్ మాల్వేర్ పై ఆధారపడి ఉంటుంది. హానికరమైన APKల నుంచి ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందో అవగాహన కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
వ్యక్తిగత డేటా చోరీకి అవకాశం..
ఈ తరహా మాల్వేర్ ను లాగిన్ చేయడం వల్ల డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉంది. లాగిన్ వివరాలు, పాస్ వర్డ్స్, కాంట్రాక్ట్ నెంబర్లు, క్రెడిట్ కార్డు వివరాలు, బ్రౌజింగ్ హిస్టరీ వంటి సమాచారాన్ని సేకరించే ప్రమాదం ఉంది. హానికరమైన ఫైల్ లు డివైస్ లొకేషన్ ను ట్రాక్ చేస్తాయి. హ్యాకర్లు మన కదలికలను పర్యవేక్షించడానికి, భవిష్యత్ లో మీ కార్యకలాపాల లక్ష్యంగా దాడులు చేయడానికి ప్లాన్ చేసే అవకాశం ఉంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
సైబర్ నేరగాళ్ళు పాల్పడుతున్న ఈ తరహా మోసాల నుంచి బయటపడడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. APK లను చూసినప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లు ఓపెన్ చేయకుండా ఉండాలి. వీలైతే బ్లాక్ చేయడం మరింత మంచిది. పొరపాటున ఓపెన్ చేసినట్లు అయితే వెంటనే సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఇటువంటి మెసేజ్లను పొరపాటున కూడా ఇతరులకు షేర్ చేయకుండా ఉండడం మంచిది.