Delhi Temperature:
ఢిల్లీలో చలి గాలులు..
ఉత్తరాదిలో ఈ సారి చలి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దాదాపు నెల రోజులుగా వణికిపోతున్నారు అక్కడి ప్రజలు. ముఖ్యంగా ఢిల్లీ వాసులు (Delhi Temperature) ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టే పరిస్థితే లేకుండా పోయింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇవాళ ఉదయం (జనవరి 12) అత్యంత కనిష్ఠంగా 3.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. ఫలితంగా ఫ్లైట్స్, రైళ్ల సేవలకు అంతరాయం కలిగింది. ఇప్పటికే ఇండియన్ రైల్వేస్ కీలక ప్రకటన చేసింది. దాదాపు 23 రైళ్లు ఆరు గంటల పాటు ఆలస్యంగా నడుస్తాయని వెల్లడించింది. పొగమంచు కారణంగా అంతరాయం కలిగినట్టు ప్రకటించింది. అటు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా కీలక ప్రకటన చేసింది. విజిబిలిటీ లేకపోవడం వల్ల ఫ్లైట్స్ సర్వీస్‌లను నిలిపివేసినట్టు వెల్లడించింది. కొద్ది గంటల పాటు ఆలస్యం జరిగే అవకాశముందని తెలిపింది. ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. ఫ్లైట్స్‌కి సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా ముందుగా సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. అటు ఉత్తరాదిలోనే కాకుండా...ఈశాన్య రాష్ట్రాల్లోనూ చలి చంపుతోంది. కొన్ని చోట్ల దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. ఒకరికొకరు ఏ మాత్రం కనిపించడం లేదు.
ఆ రాష్ట్రాల్లోనూ..
ఢిల్లీలో ఓ రోజు క్రితం కనిష్ఠంగా 5.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్ఠంగా 18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఢిల్లీతో పాటు పంజాబ్‌లోనూ పొగమంచు కమ్మేసింది. మరి కొన్ని గంటల పాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హరియాణా, ఛండీగఢ్‌లో మరో నాలుగు రోజుల పాటు పొగ మంచు ఇలాగే కమ్ముకుంటుందని వెల్లడించింది. అటు ఉత్తరప్రదేశ్‌లోనూ మూడు రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగనున్నాయి. వెస్ట్‌బెంగాల్, ఒడిశా, జమ్ము, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, సిక్కం, మధ్యప్రదేశ్, అసోం, మేఘాలయా, మిజోరం, త్రిపురలో మరో మూడు రోజుల పాటు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని IMD వెల్లడించింది. పంజాబ్‌లోని మొహాలీలో భారత్ అఫ్గనిస్థాన్ మధ్య T20 మ్యాచ్ జరిగింది. అక్కడ చలికి ప్లేయర్స్ అంతా వణికిపోయారు. స్వెటర్‌లు, మంకీ క్యాప్‌లు పెట్టుకున్నారు. చలితో తెగ ఇబ్బందులు పడ్డారు.