Swamy Vivekananda Speech In Telugu: భారతదేశం ఆధ్యాత్మిక వక్త, దేశ భక్తుడు, మాటలతో మంత్రముగ్దులను చేయగలిగే గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన జీవించింది కేవలం 39 సంవత్సరాలే. కానీ 1000 సంవత్సరాలు గడిచినా ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు. భారత దేశం అంటే, మూఢ నమ్మకాలతో, చెట్లకు పుట్లకు పూజలు చేసే ఒక అనాగరికమైన దేశం అనే భావన ఉన్న వాళ్లందరికీ ఇండియాపై ఉన్న అపోహలను తొలగించారు. గౌరవం కలిగేలా చేశారు. భారతదేశపు స్థాయిని పెంచారు. 1893 సెప్టెంబర్ 11 చికాగో జరిగిన సర్వమత మహాసభల్లో ఆయన ప్రసంగం అమెరికాను ఒక ఊపు ఊపేసింది. 


ఆ సభలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం మీకోసం..
‘అమెరికా సోదర సోదరీమణులారా!
మాకు మీరు మనఃపూర్వకంగా ఇచ్చిన స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఋషి సంప్రదాయం ప్రకారం మీకు నా అభివందనాలు. అన్ని మతాలకు, అన్ని ధర్మాలకు తల్లి అనదగిన సనాతన ధర్మం తరఫున మీకు నా అభివందనాలు. వివిధ జాతులతో, భిన్న సంప్రదాయాలతో కూడిన కోట్లాది భారతీయుల తరఫున  మీకు నా అభివందనాలు. 


సహన భావాన్ని వివిధ దేశాలకు తెలిపిన ఘనత ప్రాచ్యులకు చెందినది అనడం ఎంతో సమంజసమని సభా వేదిక నుంచి మీకు చెప్పిన వక్తలకూ నా అభివందనాలు. సహనాన్ని, అన్ని మతాలు సత్యమేనన్న విషయాన్ని ప్రపంచానికి బోధించిన సనాతన ధర్మం, నా ధర్మమని గర్విస్తున్నాను. సర్వమత సహనాన్నే కాకుండా, అన్ని మతాలు సత్యమైనవే అని మేం నమ్ముతాం. అన్ని మతాల నుంచి, అన్ని దేశాల నుంచి బాధితులై, శరణాగతులై వచ్చిన వారికి ఆశ్రయమిచ్చిన దేశం నా దేశమని గర్విస్తున్నాను. 


రోమనుల దౌర్జన్యానికి గురై తమ దేవాలయం తునాతునకలైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణు పొందిన యూదులను మా అక్కున చేర్చుకున్నామని చెప్పడానికి గర్విస్తున్నాను. మహాజోరాష్ట్రీయ సంఘంలో మిగిలిన వారికి ఆశ్రయమిచ్చి, నేటికి కూడా వారిని ఆదరిస్తున్న ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను. వివిధ ప్రదేశాల్లో పుట్టిన నదులు సముద్రంలో చేరినట్లే వివిధ ఆరాధనా మార్గాలు కూడా ఒక్కటే. ఆ సర్వేశ్వరుడిని చేరడమే. 


శాఖాభిమానం, స్వమత దురభిమానం వీటి ద్వారా పుట్టిన మూర్థాభిమానం ఈ అందమైన భూమిని చాలాకాలం నుంచి ఆక్రమించి ఉన్నాయి. ఇవి భూమిని దౌర్జన్యమయం చేసి, ఎన్నోసార్లు మానవ రక్తాన్ని చిందించాయి. నాగరికతను నాశనం చేసి సకల దేశాలను నిరాశ పాల్జేశాయి. ఈ ఘోరరాక్షసులు చెలరేగి ఉండకపోతే మానవ సమాజం నేటి కంటే బాగా అభివృద్ధి చెంది ఉండేది. కానీ వాటి అవసాన సమయం ఆసన్నమైంది. ఈ మహాసభ గౌరవార్ధం నేటి ఉదయం మోగించిన గంట అన్ని విధాలైన స్వమత దురభిమానానికి, పరమత ద్వేషానికి, కత్తితో గాని, కలంతో గాని చేసే అన్ని విధాలైన హింసలకు మాత్రమే కాకుండా, ఒకే గమ్యాన్ని చేరుకొనే మానవుల మధ్య నిష్టుర ద్వేషభావాలకు శాంతిపాఠం కాగలదని మనసారా ఆశిస్తున్నాను.’ అంటూ చికాగోలో స్వామి వివేకానంద ప్రసంగించారు.


Also Read: తాను ఎప్పుడు చనిపోతానో స్వామి వివేకానందకు ముందే తెలుసా?


Also Read: యువకులు అంటే ఎవరు? దేశంలో ఎంత మంది యువత ఉన్నారో తెలుసా?