కేరళలో మలప్పురం జిల్లా కలెక్టర్ రాణి సోయామోయి మేకప్ ఎందుకు వేసుకోరు ? అని ఓ స్కూల్ విద్యార్థి అడిగారని.. దానికి ఆమె జార్ఖండ్‌లోని మైకా గనుల ప్రాంతంలో తాను ఎలా ఎదిగింది చెప్పారని ఓ స్టోరీ సోషల్ మీడియాలో విస్తృతంగా ఫార్వార్డ్ అవుతోంది. గత నాలుగైదు రోజుల్లో ఈ స్టోరీ ఫార్వార్డ్ అయినంతగా ఇంకే న్యూస్ కూడా అయి ఉండదు. ఆ కలెక్టర్ ఎంతో స్ఫూర్తివంతురాలని మెచ్చుకున్నారు. జార్ఖండ్‌లోని మైకా గనుల్లో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా అని ఆశ్చర్యపోయారు. కానీ ఇందులో ఎంత నిజం ఉందో ఎక్కువ మంది ఆలోచించలేదు. చాలా తక్కువ మంది మాత్రం ఆమె గురించి తెలుసుకోవాలని ప్రయత్నించారు. కానీ తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే రాణి సోయామోయి అనే ఐఏఎస్ అఫీసరే కేరళలో లేరు. ఆ కథనంలో చెప్పినట్లుగా జార్ఖండ్ నుంచి ఆ పేరుతో ఎవరూ సివిల్స్ రాసి ఐఏఎస్ కాలేదు. ఈ విషయాలు తెలిసిన తర్వాత వచ్చిన క్లారిటీ ఏమిటంటే.. ఈ కథ అంతా నిజంగా కథ. ఫిక్షనే.
రాణి సోయామోయి అనే ఐఏఎస్ కేరళలో లేరు. ఆమె మలప్పురంలో కలెక్టర్‌గా చేయడం లేదు. కానీ ఈ కథను రాసింది మాత్రం కేరళకు చెందిన ఓ రచయితే. అతను ఈ రచన చేసి సోషల్ మీడియాలో ఫార్వార్డ్ చేసినట్లుగా గుర్తించారు. నిజానికి ఈ కథలో నిజంగానే జీవం ఉంది. స్ఫూర్తి ఉంది. కష్టం.. నష్టం..కన్నీళ్లు.. శ్రమ.. విజయం.. స్ఫూర్తి ఇలా అన్నీ ఉన్నాయి. నిజమే అనుకునేలా రాయడంలో రైటర్ కూడా సక్సెస్ అయ్యాడు. ఓ కలెక్టర్ ఇంత స్ఫూర్తి దాయకమైన కథను కలిగి ఉన్నారంటే ప్రజలు సాధారణంగా ఎట్రాక్ట్ అవుతారు. అందుకే వైరల్ అయిపోయింది. కానీ అసలు నిజం మాత్రం అదో కథ అని బయట పడింది.
ఈ కథను నిజంగానే జరిగినట్లుగా చాలా మీడియాలో ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా ప్రసారం చేయడం కూడా గందరగోళానికి కారణం అయింది. నిజం చెప్పులేసుకునేలోపు అబద్దం ప్రపంచం మొత్తం తిరిగి వస్తుందనే సామెత .. సామెత మాత్రమే కాదు ఈ మేకప్ వేసుకోని కలెక్టర్ కథ విషయంలో నిజమే అయింది. ఫేక్ స్టోరీ ప్రపంచం అంతా తిరిగేసింది. కానీ ఇది ఫేక్ అని ఇప్పుడు బయటకు వచ్చింది. కానీ పట్టించుకునేవారు తక్కువే.
అయితే ఫేక్ అయితేనేమీ.. ఆ కథలో స్ఫూర్తి ఉంది.. ఎవరికీ నష్టం చేయదు.. నిజంగానే జార్ఖండ్‌లోని మైకా గనుల్లో దుర్భరమైన పరిస్థితులు ఉంటాయని కొంత మంది వాదించడం కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అది కూడా నిజమే. కానీ నిజం నిజమే... స్టోరీ స్టోరీనే. అందుకే ఫ్యాక్ట్ చెక్ చేస్తే.. ఆ స్టోరీ ఫేక్‌గా తేలింది.