The History Of Refrigerator In The World: ఎండాకాలం వచ్చేసింది. ఇపుడు ఫ్రిడ్జ్ కి ఉన్న వ్యాల్యూ ప్రతి ఇంట్లోనూ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. వాటర్ బాటిళ్లు, ఐస్, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలతో పెళ్లింట్లో చుట్టాల్లా ఫ్రిడ్జ్ కళకళ్లాడిపోతుంటుంది. ఇంత ఉపకారం చేస్తున్న ఫ్రిడ్జ్ చరిత్ర మనం తెలుసుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పండి?


ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేని ఇల్లు దాదాపుగా కనపడదు. ప్రతి ఇంట్లో ఇదొక ముఖ్యమైన వస్తువు అయిపోయింది. కూలింగ్ కి, ఆహారపదార్థాలు ఎక్కువకాలం వరకు పాడవకుండా ఉండటానికి రిఫ్రిజిరేటర్లు వాడతాం. అయితే పురాతన కాలంలో ఇరానియన్లు కనిపెట్టిన యక్చల్ అనే ఒక కూలింగ్ పద్ధతి నుంచి విలియం కల్లెన్ అనే సైంటిస్ట్ ఎలక్ట్రిక్ రిఫ్రిజెరేటర్ కనిపెట్టడం మొదలు ఇప్పటి ఆధునిక కాలం వరకు ఫ్రిడ్జ్ లు అనేక విధాలుగా రూపాంతరం పొందటం చూస్తున్నాం.


ప్రాచీన కాలంలో కూలింగ్ కి ఏ పద్ధతులు వాడారు?


మోడ్రన్ రిఫ్రిజిరేటర్ కనిపెట్టడానికి ముందు మన పూర్వీకులు భూమిలో గుంతలు తవ్వి, గడ్డి కప్పి ఆహారం పాడవకుండా నిలువ చేసేవారు. ఆహారాన్ని, ఐస్ ను నిలువ చేసుకోవటానికి ఇరానియన్లు సంప్రదాయ పర్షియన్ నిర్మాణం ఒకటి కట్టుకున్నారు. ఇది మట్టి, ఇసుక, గడ్డి ని ఉపయోగించి శంఖు ఆకారంలో కట్టిన ఒక నిర్మాణం. ఈ ఆకారంలో కట్టడం వల్ల బయటి వేడి లోపలికి వెళ్లకుండా ఆహారం ఎక్కువకాలం నిలువ ఉంటుంది. ఎంతో దృఢమైన గోడలతో నిర్మించిన ఈ కట్టడానికి వారు విండ్ క్యాచర్ అనే శక్తివంతమైన వెంటిలేషన్ సిస్టంను రూపొందించారు. భూమి లోపల ఉండే ఈ ఛాంబర్లో ఐస్ ను స్టోర్ చేసేవారు. ఈ పద్ధతి ఎంతో ఎఫెక్టివ్ గా పని చేసేది. ఈ విధానమే మాడ్రన్ రిఫ్రిజిరేటర్ల తయారీకి పునాది అని చెప్పవచ్చు.


విలియం కల్లెన్ 1748 లో తక్కువ ఉష్ణోగ్రతను క్రియేట్ చేయటానికి బాష్పీకరణ విధానాన్ని ఉపయోగించి, డైథైల్ ఈథర్ కంటైనర్‌లో వాక్యూమ్‌ను సృష్టించడానికి పంపును వాడి, ఈథర్ ను ఆవిరి చేసినపుడు అది దాని పరిసరాల నుంచి వేడిని గ్రహించి చల్లబడటం ప్రారంభించిందని కల్లెన్ నిరూపించాడు. మోడ్రన్ రిఫ్రిజిరేటర్ల తయారీకి ఇదొక మైలురాయి.


ఆహారం పాడవకుండా కాపాడుకోవటానికి ఈ యాంత్రిక శీతలీకరణ పద్ధతి కొత్త పునాదులు వేసింది. జనరల్ ఎలక్ట్రిక్, కెల్వినేటర్, ఎలక్ట్రోలక్స్ వంటి కంపెనీలు ఉత్పత్తిని విపరీతంగా పెంచాయి. 1920 నాటికి కంప్రెషన్ రిఫ్రిజిరేటర్లు విస్తృతంగా మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వచ్చాయి.


అయితే శీతలీకరణగా ఈ ప్రయోగంలో అమ్మోనియా, మిథైల్ క్లోరైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి విషవాయువులను ఉపయోగించటం వల్ల క్రమంగా ఈ ఫ్రిడ్జ్ వాడకం వల్ల ప్రమాదాలు పెరిగాయి. ఇది ఫ్రిడ్జ్ తయారీలో మార్పులకు దారి తీసింది. 1920ల చివరిలో మూడు అమెరికన్ కార్పొరేషన్లు, జనరల్ మోటార్స్, డ్యూపాయింట్, కైనెటిక్ కెమికల్స్ సహకారంతో శాస్త్రవేత్తల బృందం క్లోరోఫ్లోరోకార్బన్, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్ ఉపయోగించి రిఫ్రిజిరేటర్‌లను తయారుచేయటం విప్లవాత్మక మార్పులు తెచ్చింది. 1993లో వీటిని గ్రీన్ హౌస్ వాయువులుగా గుర్తించి తొలగించే వరకూ ఈ కొత్త రిఫ్రిజిరేటర్లు ప్రామాణికంగా వాడుకలో ఉండేవి.