Hyderabad BJP Candidate: హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ప్రత్యేకత చాటుతున్న కొంపెళ్ల మాధవీ లతను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ మేరకు మోదీ మాధవీ లతపై ఎక్స్ లో ఓ పోస్టు చేశారు. మాధవీ లత ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. దాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఆ టీవీ కార్యక్రమంలో మాధవీ లత పంచుకున్న విషయాలు ఎంతో ప్రత్యేకమైనవతి ప్రధాని మోదీ కొనియాడారు. మాధవీ లత ఆలోచనల్లో లాజిక్ తో (తర్కం) పాటు అభిరుచి (ప్యాషన్) కూడా ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల కోసం ఆమెకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక, మాధవీ లత పాల్గొన్న టీవీ షోను అందరూ చూడాలని పిలుపు ఇచ్చారు. అందులో ఎన్నో పనికొచ్చే అంశాలు ఉన్నాయని.. ఆ షో పున:ప్రసారాన్ని అందరూ తప్పకుండా చూడాలని మోదీ కోరారు.


‘‘మాధవి లతా జీ, మీ ‘ఆప్ కీ అదాలత్’ ఎపిసోడ్ అసాధారణమైనది. మీరు చాలా అద్భుతమైన అంశాలు లేవనెత్తారు. వాటిలో లాజిక్ తో పాటు ప్యాషన్ కూడా ఉంది. మీకు నా శుభాకాంక్షలు. ఈ రోజు ఉదయం 10 గంటలకు లేదా రాత్రి 10 గంటలకు ఈ ప్రోగ్రామ్ పున:ప్రసారాన్ని చూడాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. మీ అందరికీ ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది’’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.