మహిళల వివాహ వయసును పెంచుతూ కేంద్ర క్యాబినేట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి సానుకూలత రావడం లేదు. మహిళల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచుతూ గతేడాది కేంద్ర క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 95 శాతం ఈ - మెయిల్ రిప్రజెంటేషన్లు.. బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటరీ ప్యానెల్‌కు అందాయి. విద్య, మహిళ, చిన్నారులు, యువత, క్రీడలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి బీజేపీ ఎంపీ వినయ్ సహస్రబుద్ది నేతృత్వం వహిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో లోక్‌సభలో ప్రవేశపెట్టిన బాల్య వివాహల (సవరణ) నిరోధక బిల్లుపై ఈ కమిటీకి దాదాపు 95వేల ఈ-మెయిల్ రిప్రజెంటేషన్లు అందాయి. ఇందులో 90వేల ఈ-మెయిళ్లు బిల్లును వ్యతిరేకించాయి.
అయితే ఇలా వ్యతిరేక అభిప్రాయాలు పంపడాన్ని ప్రభుత్వ వర్గాలు ఒక కుట్రగా అనుమానిస్తున్నాయి. మైలురాయిగా ఉన్న ప్రభుత్వ చొరవను ఓడించే కుట్రలో ఇది భాగమని కమిటీలోని వర్గాలు ఆందోళను వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆలోచన చేస్తోందని, స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు, శిశువులను పౌష్టికాహార లేమి నుంచి కాపాడేందుకు అమ్మాయిల పెళ్లి వయసును పెంచడం అవసరమని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పారు. ఈ విషయంపై అధ్యయనానికి సమతా పార్టీ మాజీ చీఫ్ జయా జైట్లీ అధ్యక్షతన గత ఏడాదే నలుగురు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది.
గత డిసెంబర్‌లో ఈ కమిటీ సిఫార్సులను కేంద్రానికి సమర్పించింది. ప్రతి రంగంలో లింగ సమానత్వం, సాధికారత పెంచాలని భావించేటప్పుడు స్త్రీ కనీస వివాహ వయసును 18 ఏళ్లకు పరిమితం చేయడం సబబు కాదని కమిటీ చెప్పింది. 18 ఏళ్ల పరిమితి వల్ల పలువురు మహిళలు కాలేజీలకు వెళ్లే అవకాశం కోల్పోతున్నారని, పురుషులకు 21 ఏళ్ల వరకు స్వీయ సంసిద్ధత సాధించేందుకు అవకాశం ఉందన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా బాల్య వివాహాల నిరోధ చట్టం (పీసీఎంఏ) 2006కు సవరణలు చేయాల్సి ఉంది.
ఇందు కోసం కకేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును అనేక రాజకీయ పార్టీలు, పలు మత సంస్థలు వ్యతిరేకించాయి. ఈ కారణంగా బిల్లుపై అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి లోక్‌సభ నివేదించింది. బీజేపీ ఎంపీ వినయ్ సహస్రబుద్దే ఛైర్మన్‌గా నియమించింది. మొత్తం 31 మంది పార్లమెంటు సభ్యులున్న కమిటీలో తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ సుస్మితా దేవ్‌ను సభ్యురాలిగా నియమించారు. మహిళల కోసం ఉద్దేశించిన బిల్లును పరిశీలించి సిఫార్సులు చేయడానికి ఏర్పాటుచేసిన కమిటీలో ఒకే మహిళా ఎంపీ ఉన్నారు. ఈ కమిటీకి ఎక్కువ అభిప్రాయాలు వయసు పెంచవద్దనే వచ్చాయి.