దక్షిణ హరియాణాలోని నూహ్‌లో జులై 31 న మత ఘర్షణల కారణంగా రెవారీ, మహేందర్‌గఢ్, ఝజ్జర్ మూడు జిల్లాల్లోని 50 పంచాయతీల పెద్దలు ముస్లిం వ్యాపారులను తమ గ్రామాల్లోకి రాకుండా బహిష్కరిస్తూ లేఖలు విడుదల చేశారు. గ్రామాల్లో నివసించే ముస్లింలు తమ గుర్తింపు పత్రాలను పోలీసులకు సమర్పించాలని సర్పంచ్‌ల సంతకాలతో కూడిన లేఖల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఎవరి మనోభావాలు తెబ్బతీయాలని లేదన్నారు.
 
దీనిపై నార్నాల్ (మహేందర్‌గఢ్) సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ మనోజ్ కుమార్ స్పందిస్తూ.. తనకు లేఖల కాపీలు అందలేదని, అయితే వాటిని సోషల్ మీడియాలో చూశానని, అన్ని పంచాయతీలకు షోకాజ్ నోటీసులు పంపాలని స్థానిక అధికారులను ఆదేశించామని తెలిపారు. ఇలాంటి లేఖలు ఇవ్వడం చట్ట విరుద్ధమన్నారు. ఈ గ్రామాల జనాభాలో మైనారిటీ కమ్యూనిటీ 2% కూడా లేదని, ప్రతి ఒక్కరూ సామరస్యంగా జీవిస్తున్నారని, ఇలాంటి లేఖలు సామరస్యాన్ని దెబ్బతీస్తుందన్నారు.

  


మహేందర్‌గఢ్‌లోని సైద్‌పూర్ సర్పంచ్‌ వికాస్‌ను ఈ లేఖలపై స్పందిస్తూ గ్రామంలో గత జులైలో అనేక దొంగతనం కేసులు నమోదయ్యాయని చెప్పారు. తమ గ్రామాల్లోకి బయటి వ్యక్తులు ప్రవేశించడం మొదలయ్యాకే ఇలాంటి సంఘటనలు అన్నీ జరుగుతున్నాయని అన్నారు. నుహ్ ఘర్షణ జరిగిన వెంటనే, ఆగస్టు 1న పంచాయితీ నిర్వహించామని, శాంతిని కాపాడేందుకు వారిని తమ గ్రామాల్లోకి అనుమతించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మతం ఆధారంగా ఒక వర్గాన్ని వేరు చేయడం చట్ట విరుద్ధమని తన న్యాయ సలహాదారు చెప్పడంతో తాను లేఖను ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు. ఆ లేఖ సోషల్ మీడియాలో ఎలా సర్క్యులేట్ అయిందో తెలియడం లేదని.. దాన్ని వెనక్కి తీసుకున్నామని ఆయన చెప్పారు. 


లేఖ జారీ చేసిన మొదటి గ్రామం సైద్‌పూర్ అని దానిని ఇతరులు అనుసరించారని అన్నారు. మహేందర్‌గఢ్‌లోని అటాలీ బ్లాక్ నుంచి సుమారు 35 లేఖలు విడుదల అయ్యాయని, మిగిలినవి ఝజ్జర్, రేవారీ నుంచి జారీ చేశారని తెలిపారు. 


తాజ్‌పూర్ గ్రామానకి చెందిన వ్యక్తులు స్పందిస్తూ తమకు ఇక్కడ ఎలాంటి సమస్య లేదని. కానీ కొందరు పెద్ద మనుషులు తరఫున ఫోన్ కాల్స్, వారి తరఫున మనుషులు రావడంతో ఈ పరిస్థితికి కారణమై ఉండొచ్చని చెప్పారు. మొత్తం 750 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో మైనారిటీ వర్గాలకు చెందిన కుటుంబాలు లేవు. అందుకే తమకు ఎలాంటి ఆందోళన లేదని స్థానికులు కూడా చెప్పారు. 


తాము ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నామని, నుహ్‌లో ఏమి జరుగుతుందో తమకు తెలుసున్నారు. కానీ మాకు ఇక్కడ మతపరమైన ఉద్రిక్తతలు లేదా భద్రతా ఆందోళనలు లేవన్నారు. గ్రామ సర్పంచ్ రాజ్‌కుమార్‌ను స్థానికంగా 'టైగర్' అని పిలుస్తారని చెప్పారు. ఆయనకు వికాస్ నుంచి కాల్ వచ్చిందని, ఆదేశాలు జారీ చేస్తూ లేఖ ఇవ్వాలని  అగిగినట్లు చెప్పారు.  


దీనిపై రాజ్‌కుమార్ స్పందిస్తూ.. నేరాల అదుపునకు ఇది నివారణ చర్య అని, అందులో తనకు ఎలాంటి తప్పు  కనిపించలేదని ఇతరులను కించపరిచేలా కూడా లేదన్నారు. వికాస్ జారీ చేసిన లేఖ టెంప్లేట్ తమ వద్ద ఉందని, దానిని తాము కాపీ చేశామన్నారు. 


లేఖ విడుదల చేసిన కుంజ్‌పురా సర్పంచ్ నరేందర్ కూడా మీడియాతో మాట్లాడారు.. మేవాత్ ప్రాంతానికి చెందిన కొందరు పశువుల పెంపకం, ఇతర వ్యాపారాల కోసం తమ గ్రామానికి వస్తుంటారని తెలిపారు. నూహ్‌ ఘటన ఇక్కడ ఈ వ్యాపారాలను దెబ్బతీసిందని, కొంత మంది బయటి ప్రాంతం నుంచి వచ్చి నివసిస్తున్నారని అన్నారు. 


కుంజ్‌పురా గ్రామంలో మైనారిటీ కమ్యూనిటీకి చెందిన సుమారు 100 మంది ప్రజలు నివసిస్తున్నారు. వారు "అడ్డా"లో పేకాట ఆడుతుంటారు. తామంతా కలిసి జీవిస్తున్నామన్నారు మాజిద్ అనే వ్యాపారి. నుహ్ గురించి విన్నామని, కానీ అది తమకు అవసరం లేని విషయం అన్నారు. తన కుటుంబం నాలుగు తరాలుగా ఇక్కడ నివసిస్తోందని చెప్పాడు. 


గ్రామంలో తమ సామాజికవర్గానికి చెందిన 80 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. తమ మధ్య ఎప్పుడూ విభేదాలు లేవని. మతం తమ స్నేహాన్ని ప్రభావితం చేయదని, మేము కలిసి పెరిగామని చెప్పాడు.