Jnanpith Awards 2023: సాహిత్య రంగంలో క‌వులు(Poets), ర‌చ‌యిత‌లు(Writers) క‌ల‌లు క‌నే అవార్డు.. ఇక‌, త‌త్స‌మాన‌మైన అవార్డులేద‌న్న‌ట్టుగా భావించే పుర‌స్కారం.. `జ్ఞాన‌పీఠ్‌`(Jnanpith).  ఈ అవార్డును పొందడం కోసం ప‌నిచేసిన వారు.. కృషి చేసిన వారు గ‌తంలో ఎంతో మంది క‌నిపించారు. కానీ, అవార్డుల‌తో ప‌నిలేకుండా.. తాము ఎంచుకున్న రంగంలో విశేష కృషి చేసి.. జ్ఞాన‌పీఠం వ‌రించిన వారు అత్యంత త‌క్కువ మంది ఉన్నారు. ఇలాంటి వారిలో తాజాగా ఈ పుర‌స్కారానికి ఎంపికైన గుల్జార్‌, రామ‌భ‌ద్రాచ‌ర్య‌లు చేరుతార‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తీ లేదు. వారి కృషి అన‌న్య సామాన్యం. ఏదో కావాల‌ని.. ఏదో రావాల‌ని.. వారు  అనుకోలేదు. ఏదో వ‌స్తుంద‌ని కూడా  ఆశించ‌లేదు. వారిని వెతుక్కుంటూ.. జ్ఞాన‌పీఠ‌మే క‌ద‌లి వెళ్లింది!  వారి స్ప‌ర్శ‌తో పునీత‌మైంది!!


ఎవ‌రు వారు? 


మ‌న దేశంలో ఏటా వివిధ భాష‌లు, సాహిత్యంలో ప్ర‌క్రియ‌ల‌కు సంబంధించి అన‌న్య సామాన్య కృషి స‌ల్పిన వారికి జ్ఞాన‌పీఠ్ అవార్డుల‌ను ఇస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో ఒక‌టి రెండు సార్లు ఈ అవార్డుల ఎంపిక వ్య‌వ‌హారం తీవ్ర వివాదం అయింది. ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. తాజాగా.. ప్రసిద్ద ఉర్దూ(Urdu) కవి, పాటల రచయిత గుల్జార్‌(Guljar), సంస్కృత(Sanskrit) పండితులు, తులసీపీఠం వ్యవస్థాపకులు జగద్గురు రామభద్రాచార్యలు(Ramabhadracharyulu) 2023 సంవత్సరానికి జ్ఞానపీఠ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరి చ‌రిత్ర‌.. అమేయం. అమోఘం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. వీరి ఎంపిక ముదావ‌హం అన‌డం కూడా చిన్న‌మాటే అవుతుంది. 


గుల్జార్ ఎవ‌రంటే.. 


జ్ఞాన‌పీఠ్ అవార్డుకు ఎంపికైన ఉర్దూ క‌వి గుల్జార్‌ అసలు పేరు సంపూరణ్‌ సింగ్‌ కల్రా(Sampuran 'singh kalra). ఆయన వయసు 89 ఏళ్లు. ఉర్దూ కవుల్లో అత్యుత్త‌మ ప్ర‌తిభ‌ను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ సినిమా(Movies)ల్లో ఆయన రాసిన పాటలు విశేష ఆదరణ పొందాయి. పంజాబీతోపాటు పలు ఇతర భాషల్లోనూ ఆయన రచనలు చేశారు. 2002లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, 2004లో పద్మభూషణ్‌, 2013లో దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాలు ఆయనకు లభించాయి.  ఐదు జాతీయ ఫిల్మ్‌ అవార్డులు దక్కాయి. 2009లో ఆస్కార్‌ పురస్కారం పొందిన `స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌` సినిమాలో `జై హో` అనే పాట గుల్జార్ రాసిందే. ఇప్పుడు మ‌రో మ‌హోన్న‌త పుర‌స్కారానికి గుల్జార్ ఎంపిక కావ‌డం.. ఉర్దూ భాష‌కే గ‌ర్వ‌కార‌ణం. 


రామ‌భ‌ద్రాచార్యుల స్వ‌గ‌తం ఇదీ.. 


తాజాగా జ్ఞాన్‌పీఠ్‌కు ఎంపికైన రామ‌భ‌ద్రాచార్యులు.. రామానంద సంప్రదాయానికి చెందిన నలుగురు జగద్గురు రామానందచార్యులలో ఒకరు. 1982 నుంచి ఆయన జగద్గురువుగా ఉన్నారు. అసలు పేరు గిరిధర్‌ మిశ్రా. వయసు 74 ఏళ్లు. రెండు నెలల పసితనంలోనే అనారోగ్యంతో కంటి చూపు కోల్పోయినప్పటికీ సంస్కృతంలో అపారమైన పాండిత్యం సంపాదించారు. ఆయన 22 భాషల్లో మాట్లాడగలరు. సంస్కృతంతోపాటు హిందీ, అవధ్‌, మైథిలీ తదితర భాషల్లో అనేక కవితలు, రచనలు చేశారు. రామభద్రాచార్య గంటకు 100కు పైగా సంస్కృత పద్యాలను రచించగలరని, ప్రస్తుత కాలంలో సంస్కృత పాండిత్యానికి సంబంధించి ఆయనకు దరిదాపుల్లో ఎవరూ లేరని జ్ఞానపీఠ్‌ కోసం ఆయన పేరు ప్రతిపాదించిన న్యాయనిర్ణేతలు భావించారు. 


ఇదీ క‌మిటీ.. 


ఏటా జ్ఞాన‌పీఠ్ పుర‌స్కారాల‌ను ఇచ్చేముందు.. కేంద్ర సాహిత్య అకాడ‌మీ.. ఒక క‌మిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ క‌మిటీఅన్ని కోణాల్లోనూ ప‌రిశీలించి.. పుర‌స్కారాలకు ల‌బ్ధ‌ప్ర‌తిష్ఠుల‌ను సిఫారసు చేయ‌డం లేదా ప్ర‌క‌టించ‌డం చేస్తుంది. ఈ సారి.. ప్రముఖ ఒడియా రచయిత్రి, జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత ప్రతిభా రే(Prathibha rey) అధ్యక్షతన 11 మంది సాహితీవేత్తలతో కూడిన క‌మిటీ నియామ‌క‌మైంది. ఈ క‌మిటీ అన్ని కోణాల్లోనూ ప‌రిశీలించి.. ఉర్దూ క‌వి  గుల్జార్‌, సంస్కృత పండితులు రామభద్రాచార్యల‌ను ఎంపిక చేసింది. వీరు తమ తమ రంగాల్లో అసాధారణమైన సాహితీ సేవ చేశారు. కాగా, సంస్కృత భాషకు జ్ఞానపీఠ్‌ లభించటం రెండోసారి. ఉర్దూ భాషావేత్త‌కు ల‌భించ‌డం ఇది ఐదోసారి.


21 ల‌క్ష‌ల రివార్డు!


దేశంలో.. 1961 నుంచి సుప్ర‌శిద్ధ క‌వులు, ర‌చ‌యిత‌ల‌కు జ్ఞానపీఠ్‌ పురస్కారం ఇవ్వ‌డాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ప్రకటించినది 58వ పురస్కారం. అవార్డు కింద గ్రహీతకు రూ.21 లక్షల నగదు, వాగ్దేవి విగ్రహం, సన్మానపత్రం అందజేస్తారు.