Pakistani Terrorists Killed: 


ఇద్దరు ఉగ్రవాదులు హతం..


జమ్ముకశ్మీర్ పోలీసులు ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. కుప్వారా వద్ద LACని దాటి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు ముష్కరులు. వెంటనే పసిగట్టిన ఆర్మీ వాళ్లను ఎన్‌కౌంటర్ చేసింది. నార్త్ కశ్మీర్‌లోని మచిల్ సెక్టార్ వద్ద అక్రమ చొరబాటుకి యత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారంతో ముందుగానే ఆర్మీ, పోలీసులు అప్రమత్తమయ్యారు. జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఆ ఇద్దరు తీవ్రవాదుల్ని మట్టుబెట్టారు. ఎన్‌కౌంటర్ చేసిన ప్రాంతం నుంచి 2 AK రైఫిల్స్, 4 AK మ్యాగజైన్స్‌, పాకిస్థానీ పిస్టోల్‌ని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ కరెన్సీని సీజ్ చేశారు. ఇదే విషయాన్ని కుప్వారా జిల్లా పోలీసులు ట్విటర్‌లో అధికారికంగా వెల్లడించారు.





గత నెలలో భద్రతా బలగాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు ముష్కరులు. ఈ దాడిలో సైనికులు సురక్షితంగా బయటపడ్డారు. ఖన్యార్ ప్రాంతం వద్ద దాడి జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఓ ఉగ్రవాది CRPF బలగాలున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. ఆ తరవాత అక్కడి నుంచి పారిపోయాడు. ఆ ఉగ్రవాదిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ దొరక్కుండా తప్పించుకున్నాడు. తరచూ LAC వద్ద ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పోలీసులతో పాటు సైనికులూ చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. ఎక్కడా అలజడులు సృష్టించకుండా ముందస్తుగానే కుట్రల్ని భగ్నం చేస్తున్నారు.