Citizenship Gave Up: భారత దేశాన్ని వదిలేసి విదేశాల్లో స్థిరపడుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ వేదికగా చెప్పింది. గత 12 ఏళ్లలో ఏకంగా 16.63 లక్షల మంది భారతీయులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వి. మురళీధరన్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి.. ఈ మేరకు వివరాలు వెల్లడించారు. 2014 నుంచి 2022 మధ్య 12,88,293 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని వెల్లడించారు. ఇండియన్ సిటిజెన్‌షిప్ ను వదులుకున్న భారతీయుల సంఖ్య 2022లో అత్యధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.


ఒక్క 2022 ఏడాదిలోనే ఏకంగా 2,25,620 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2014 నుంచి 2022 మధ్యలో 2,46,580 మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను సరెండర్ చేశారని.. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు 9,235 మంది ఉండగా.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 7,256 మంది ఉన్నట్లు కేంద్ర మంత్రి రాజ్యసభలో తెలిపారు. అత్యధికంగా ఢిల్లీ నుంచి 60,414 మంది, పంజాబ్ నుంచి 28,117 మంది గుజరాత్ నుంచి 22,300 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. గోవా నుంచి 18,610 మంది, మహారాష్ట్ర నుంచి 17,171 మంది, తమిళనాడు నుంచి 14,046 మంది తమ తమ పాస్‌పోర్టులను సరెండర్ చేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వి. మురళీధరన్ తెలిపారు.


Also Read: మణిపూర్ తగలబడుతుంటే, పార్లమెంట్‌లో జోక్‌లు ఏంటి - ప్రధానిపై రాహుల్ ఫైర్


మెరుగైన జీవన ప్రమాణాల కోసం సంపన్నులు కుటుంబ సమేతంగా విదేశాలకు తరలిపోతున్నారు. ఇతర దేశాలలో పౌరసత్వం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కోట్లకొద్ది ఆస్తులు ఉన్న కుబేరులు దేశం విడిచి వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. అమెరికాలో ఈబీ-5 ఇన్వెస్ట్‌మెంట్‌ వీసా ద్వారా గ్రీన్ కార్డు పొంది పౌరసత్వం పొందుతున్నారు. ఈ ఈబీ-5 ఇన్వెస్ట్‌మెంట్‌ వీసా రావాలంటే కనీసం 8 లక్షల డాలర్లు ఖర్చవుతుంది. ఇలా వచ్చిన వారు 10 మంది స్థానికులకు ఉపాధి కల్పించాలి. పోర్చుగీసు, దుబాయి తదితర దేశాల్లో అయితే గోల్డెన్ వీసా పేరుతో శాశ్వత నివాసం పొందుతున్నారు. దీనికి కూడా భారీగా ఖర్చవుతుంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, పోర్చుగీస్, గ్రీస్, దుబాయ్, జర్మనీ, యూఏఈ తదితర 135 దేశాలకు భారతీయులు వెళ్తున్నారు. ఆయా దేశాల్లో పౌరసత్వం కోసం వేలకొద్ది దరఖాస్తు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే శాశ్వత నివాసం కోసం 4,16,000 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నట్లు అంచనా. ధనవంతులు దేశం విడిచి వెళ్లడం వల్ల ఇక్కడి సంపద కొంత తరిలిపోతుంది. దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎంతో కొంత ఉంటుంది. 


ద్వంద్వ పౌరసత్వాన్ని భారత్ అనుమతించదు


చాలా మంది భారతీయులు విదేశాల్లో సంవత్సరాల తరబడి ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడిపోయారు. అలాంటి వారు భారత్ కు రావడానికి ఇష్టపడటం లేదు. వారు అక్కడే స్థిరపడటానికి భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. ధనవంతులు మెరుగైన జీవన ప్రమాణాల కోసం భారత్ ను వదిలి విదేశాలకు వెళ్తున్నారు. ద్వంద్వ పౌరసత్వ విధానాన్ని భారత్ అనుమతించదు. దీని వల్ల ఒక దేశ పౌరసత్వం కావాలంటే తప్పనిసరిగా భారత పౌరసత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. భారత పాస్‌పోర్టును సరెండర్ చేసి భారత పౌరసత్వాన్ని కోల్పోతే స్థానికంగా ఎలాంటి హక్కులు ఉండవు. ప్రభుత్వ ఉద్యోగాలు చేయరాదు, భూములు కొనరాదు, ఎన్నికల్లో పోటీ చేయరాదు. పౌరసత్వం కోల్పోయిన వారు భారత్ కు రావాలంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు ద్వారా లేదా వీసా తీసుకుని మాత్రమే రావాల్సి ఉంటుంది.