Amit Shah:
వణుకు పుట్టించే శిక్షలు
మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్న క్రమంలోనే మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్‌పై సామూహిక అత్యాచారం చేసిన నేరస్థులకు మరణ శిక్ష విధిస్తామని ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో వెల్లడించారు. దేశ శిక్ష్మాస్మృతిలో (Criminal Law) పలు మార్పులు చేసిన కేంద్రం..మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ కొత్త బిల్లుల ప్రకారం...పలు నేరాలకు శిక్షను మరింత కఠినతరం చేశారు. ఆ నేరం చేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టించేలా శిక్ష విధించనున్నట్టు అమిత్‌షా ప్రకటించారు.
ఏయే నేరానికి ఏయే శిక్ష..?
వివాదాస్పద దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించిన అమిత్ షా...నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా కొత్త బిల్లుని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. మూకదాడుల విషయంలో నేర తీవ్రతను బట్టి మరణశిక్ష విధిస్తామని తేల్చి చెప్పారు. ఇక ఎన్నికల సమయంలో మద్యంతో పాటు నోట్లు పంచడం సాధారణమైపోయింది. లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు అనధికారికంగా జరుగుతుంటాయి. వీటిని నియంత్రించేందుకూ కేంద్రం కొత్త ప్రొవిజన్ తీసుకురానుంది. ఓటర్లకు డబ్బులు పంచిన వాళ్లకు కనీసం ఏడాది పాటు జైలుశిక్ష విధిస్తామని వెల్లడించింది. ఇక సామూహిక అత్యాచారాలపైనా కొరడా ఝుళిపించింది. ఈ కేసుల్లో నేరస్థులుగా రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్ష తప్పదు. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన వారికి ఉరిశిక్ష విధిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
"బ్రిటీష్ కాలం నాటి చట్టాలన్నింటినీ తొలగించాలన్నదే మా ఉద్దేశం. అందుకే శిక్షాస్మృతిలో మార్పులు చేర్పులు చేశాం. వీటి లక్ష్యం కేవలం శిక్షించడం మాత్రమే కాదు. న్యాయం చేయడం కూడా. నేరాలను నియంత్రించాలనే ఉద్దేశంతోనే ఇలా కఠిన శిక్షలు వేయాలని నిర్ణయించుకున్నాం"
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి