Sedition Law: 


త్వరలోనే దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయనున్నట్టు లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం ఓ ప్రతిపాదన చేసినట్టు వెల్లడించారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ చట్టం వివాదాస్పదమవుతోంది. కుట్రపూరితంగా కావాలనే కొందరిపై ఈ చట్టం పేరుతో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారన్న విమర్శలు, ఆరోపణలూ ఉన్నాయి. రద్దు చేయాలని ప్రతిపక్షాలు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అమిత్‌ షా చేసిన ప్రకటన కీలకంగా మారింది. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) ఇకపై ఇండియన్ జస్టిస్ కోడ్‌గా మారుతుందనీ ప్రకటించారు. భారతీయ న్యాయ సన్హిత బిల్‌లో (Bharatiya Nyaya Sanhita Bill) భాగంగా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో కీలక మార్పులు చేయనున్నట్టు వెల్లడించారు. భారతీయ న్యాయ సన్హిత బిల్, భారతీయ నాగరిక్ సురక్ష సన్హిత, భారతీయ సాక్ష్య బిల్స్‌ని ప్రవేశపెట్టే సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు అమిత్‌ షా. 


 



"1860 నుంచి ఇప్పటి వరకూ దేశ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ బ్రిటీష్‌ చట్టాలకు అనుగుణంగానే పని చేస్తోంది. అందులోని మూడు బిల్స్‌ స్థానంలో కొత్త బిల్స్‌ని ప్రవేశ పెడుతున్నాం. అంతే కాకుండా...న్యాయ వ్యవస్థలో కీలక సంస్కరణలూ చేయనున్నాం. ఇందులో భాగంగానే దేశ ద్రోహ చట్టాన్ని రద్దు చేస్తాం. ఈ కొత్త చట్టాలతో 90% పైగా నేరగాళ్లకు కచ్చితంగా శిక్షలు పడేలా ప్రొవిజన్స్ చేర్చాం. ఏడేళ్లకు పైగా జైలు శిక్షపడే కేసుల్లో ఫోరెన్సిక్‌ టీమ్‌ క్రైమ్ సీన్‌ని పరిశీలించడాన్ని తప్పనిసరి చేస్తున్నాం."


- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి





బ్రిటీష్ కాలం నాటి చట్టాలను మార్చడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు అమిత్ షా. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమనిల్ ప్రొసీజర్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ చట్టాలకు బదులుగా ఈ కొత్త బిల్స్‌ని ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం...2014-20 మధ్య కాలంలో దాదాపు 399 దేశ ద్రోహ చట్టాలు నమోదయ్యాయి. అయితే...వీటిలో 8 కేసుల్లో మాత్రమే శిక్ష పడింది. 2014తో పోల్చుకుంటే 2020 నాటికి దేశ ద్రోహ కేసులు 55% మేర పెరిగాయి. గతేడాది సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుంది. దేశ ద్రోహం కేసుల విచారణను సస్పెండ్ చేసింది. ఈ చట్టాన్ని రివ్యూ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దుర్వినియోగం అవకుండా చూడాలని తేల్చి చెప్పింది. శాంతి భద్రతలను కాపాడుతూనే...భావ ప్రకటనా స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్రం ఈ ప్రకటన చేసింది.