World Economic Forum Predictions: ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారత్‌ ఆర్థిక వ్యవస్థ చాలా సానుకూలంగా ఉందని మోదీ సర్కార్‌ చాలా ధీమాగా చెబుతోంది. కరోనా లాంటి సంక్షోభాన్నీ తట్టుకుని మనం నిలదొక్కుకున్నామని అంటోంది. ప్రతిపక్షాలు ఇదంతా ఒట్టి మాటలే అని కొట్టి పారేస్తున్నప్పటికీ...ఇప్పుడు స్వయంగా World Economic Forum ప్రెసిడెంట్ Borge Brende భారత ఆర్థిక వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027 నాటికి భారత్ అతి పెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. అంతే కాదు. త్వరలోనే భారత్ 10 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని స్పష్టం చేశారు. PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలా ఉన్నా...భారత్ మాత్రం స్థిరంగా ముందుకు వెళ్తోందని ప్రశంసలు కురిపించారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సులో భారత్‌పై అన్ని దేశాలూ ఆసక్తి చూపించాయని, ఆర్థికంగా ఎదిగేందుకు భారత్ అన్ని విధాలుగా కృషి చేస్తోందని తెలిపారు. ఇదే ఉత్సాహం భవిష్యత్‌లోనూ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు బోర్గె బ్రెండే. 


"నేను ఎప్పుడు భారత్‌కి వచ్చినా ఏదో తెలియని ఓ విశ్వాసం కలుగుతుంది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ఆ అనుభూతి కలగదు. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయినా భారత్ మాత్రం సానుకూలంగా అడుగులు వేస్తోంది. మిగతా దేశాలపైనా దృష్టి సారించాల్సిన అవసరముంది. 2027 నాటికి భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్న విశ్వాసముంది"


- బోర్గె బ్రెండ్, WEF అధ్యక్షుడు 


అమెరికా కూడా ఇప్పుడిప్పుడే ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకుంటోందని వివరించారు WEF ప్రెసిడెంట్. 7%తో జీడీపీతో సానుకూలంగా ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. వచ్చే రెండు మూడేళ్లలో భారత్‌ ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానానికి చేరుకుంటుందని అన్నారు. కొన్నేళ్లుగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు జరిగాయని, అమెరికా చైనాతో పోల్చితే భారత్‌ మెరుగ్గా ఉందని వెల్లడించారు. భారత్‌లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. 


ఎర్ర సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభంతో లక్షల కోట్ల డాలర్ల నష్టం జరిగే ప్రమాదముందన్న అంచనాలున్నాయి. చమురు మోసుకొస్తున్న ఓడలపై హౌతీలు దాడులు చేస్తున్నారు. ఫలితంగా...అవి నడి సముద్రంలో చిక్కుకుపోయాయి. ఈ దాడుల కారణంగా చమురు సరఫరాకి అంతరాయం కలుగుతోంది. ఈ పరిణామాలపై.. World Economic Forum అధ్యక్షుడు బార్జ్ బ్రెండే కీలక వ్యాఖ్యలు చేశారు. డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లై లేకపోవడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు 10-20% మేర పెరిగే ప్రమాదముందని బాంబు పేల్చారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. Suez Canal ని మూసేయడం వల్ల అంతర్జాతీయంగా చమురుతో పాటు నిత్యావసర సరుకుల సరఫరాకి అంతరాయం కలుగుతుందని...వాటి ధరలు అమాంతం పెరిగొచ్చని అంచనా వేశారు. దావోస్‌లో జరిగిన WEF సమావేశానికి హాజరైన బ్రెండే...ఈ విషయం ప్రస్తావించారు. ఇప్పటికే ఈ ప్రభావం మొదలైందని వెల్లడించారు. 


Also Read: సత్యపాల్ మాలిక్ ఇళ్లలో సీబీఐ సోదాలు, ఆ ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి?