Shanmukh Jaswanth Caught With Drugs: నిత్యం వివాదాల్లో ఉండే ప్రముఖ యూట్యూబర్‌, బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్ షణ్ముఖ్‌ జశ్వంత్ మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ సారి ఏకంగా గంజాయి సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడినట్లు సమాచారం. ఓ యువతి ఇచ్చిన కంప్లైట్ తో షణ్ముఖ్ సోదరుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు షణ్ముక్ గంజాయి తాగుతూ కనిపించాడని తెలిసింది. వెంటనే పోలీసులు షణ్ముక్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడి సోదరుడు సంపత్ వినయ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఇంతకీ ఏం జరిగిందంటే?


షణ్ముక్ జశ్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఓ అమ్మాయితో చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. కొంత కాలం క్రితం వీళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. కారణాలు ఏంతో తెలియదు కానీ, కొద్ది రోజులు ఆ అమ్మాయిని దూరం పెట్టాడు. సుమారు 20 రోజుల క్రితం ఆమెను కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంలో ఏపీలో ఉంటున్న తన ప్రియురాలికి తెలియడంతో హైదరాబాద్ నార్సింగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గత 10 సంవత్సరాలుగా తాము ప్రేమలో ఉన్నామని, ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిందని, ఇప్పుడు తనను కాదని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కంప్లైట్ లో వెల్లడించింది. అమ్మాయి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టారు.


సోదరుడి కోసం వెళ్తే అన్నబుక్కయ్యాడు!


సదరు అమ్మాయితో కలిసి పోలీసులు సంపత్ వినయ్ ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్ జశ్వంత్ ఫ్లాట్ కు వెళ్లారు. ఇంట్లోకి వెళ్లి చూడగా, షణ్ముక్ గంజాయి తాగుతూ కనిపించాడు. అంతేకాదు, అతడి దగ్గర మరో 16 గ్రాముల గంజాయి దొరికినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా షణ్ముక్ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పాటు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన సోదరుడు సంపత్‌ను కూడా పట్టుకున్నారు.






మద్యం మత్తులో కారుతో బీభత్సం


గతంలోనూ షణ్ముక్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. హైదరాబాద్‌లో అతివేగంగా కారును నడిపి మూడు వాహనాలను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి కూడా మృతి చెందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కడం షణ్ముఖ్ కు కామన్ అయ్యింది. యూట్యూబ్ వేదికగా పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జశ్వంత్. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించాడు. కానీ, నిత్యం వివాదాల్లో చిక్కడం పట్ల నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గంజాయి సేవించే షణ్ముఖ్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే మరిన్ని తప్పులు చేసే అవకాశం ఉందంటున్నారు.


Read Also: నెలకు రూ.35 లక్షలు - ఆ ఛాన్సు వదులుకొని అష్టకష్టాలు పడ్డా: ‘12Th ఫెయిల్’ హీరో ఆవేదన