Achievements At 75 :   భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. అయితే స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అదే ట్యాగ్. ఇప్పుడూ అదే ట్యాగ్. అయితే ప్రపంచ జనాభాలో భారత్ వాటా పదిహేను శాతానికన్నా ఎక్కువే. అవకాశాలు ఉన్న చోట జనాభా ప్లస్ పాయింట్. కానీ అవకాశాలు సృష్టించుకుంటూ ముందుకు సాగాల్సిన చోట కాస్త కఠినమే. అయినా ఈ సవాళ్లను భారత్  సమర్థంగా ఎదుర్కొంంది. 75 ఏళ్ల కాలంలో అనితర సాధ్యంగా ముందుకు సాగుతూ వెళ్తోంది. దానికి భారత్ ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తున్న సూచీలే నిదర్శనం.


పోటీతత్వ సూచీలో భారత్ పరోగమనం ! 


ప్రపంచ ఆర్థిక వ్యవస్థల ‘పోటీతత్వ సూచీ’లో భారత్ గణనీయంగా పురోగమించింది. అంతకుముందు వరకు 43వ స్థానంలో ఉన్న భారత్.. 6 స్థానాలు పురోగమించి 37వ స్థానానికి చేరింది. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, వ్యాపార రంగానికి లభిస్తున్న ప్రోత్సాహం, ఉద్యోగ కల్పన వంటి అంశాలు ప్రాతిపదికగా  ఈ ర్యాంకులు ఇస్తారు.  మన ఆసియా ఖండం నుంచి ఈ సూచీలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన దేశాల జాబితాలో సింగపూర్ (3), హాంకాంగ్ (5), తైవాన్ (7), చైనా (17)  ఉన్నాయి. తర్వాత  మన దేశమే ఉంది. 
 
హ్యూమన్ డెలవప్‌మెంట్ ఇండెక్స్‌లో మెరుగుదల !
 


అంతర్జాతీయ సూచీల్లో ప్రధానమైనదిగా హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌.   ఈ సూచీని మూడు అంశాల ఆధారంగా రూపొందిస్తారు. దీర్ఘ, ఆరోగ్యకర జీవనం, జ్ఞానాన్ని పొందే వీలు, మంచి జీవన ప్రమాణాలు అనే మూడు అంశీభూతాల ఆధారంగా సూచికను తయారు చేస్తారు. 2020 హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో మొత్తం 189 దేశాలు ఉండగా అందులో భారత్ 131వ స్థానంలో ఉన్నది. ఇతర  దేశాలతో పోల్చడం కంటే.. మన దేశం దాని క్రితం ఏడాది కంటే ఏ విధంగా ప్రదర్శన ఇస్తున్నది అనే విషయాలను చూద్దాం. ఈ సూచీలోని దేశాల జాబితాను నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు. లో, మీడియం, హై, వెరీ హై అనే కేటగిరీల్లో ఈ దేశాలను చేర్చుతారు. భారత్ 0.645 పాయింట్లతో మీడియం కేటగిరీలో ఉన్నది.   దాదాపు 50 శాతం పెరుగుదలగా ఐరాస తన నివేదికలో పేర్కొంది. 1990 నుంచి 2019 కాలంలో భారత జీవిత కాలం సుమారు 11.8 ఏళ్లు పెరిగింది. స్కూలింగ్ 3.5 ఏళ్లకు పెరిగింది. ఇది గొప్ప స్థాయి కాకపోయినా మరీ అథమం కాదు. మెరుగుపడుతుందని ్నుకోవచ్చు. 


హ్యాపీ నెస్ ఇండెక్స్ !


హ్యాపినెస్ ఇండెక్స్‌లో మాత్రం భారత్ తిరోగమిస్తున్నది. 2013లో 47.7 పాయింట్లు సాధించుకున్న భారత్ 2017లో ఈ పాయింట్లు 43.2కు, 2020లో ఈ పాయింట్లు 38.2కు పడిపోయాయి. 2022లో యూఎన్ విడుదల చేసిన హ్యాపినెస్ ఇండెక్స్‌లో భారత్ 136వ స్థానంలో ఉన్నది. మొత్తం 150 దేశాలకు ర్యాంక్ విడుదల చేసింది. గతేడాదితో పోల్చితే మూడు స్థానాలు ఎగబాకింది. హ్యాపీ నెస్ అనేది రావాలంటే.. ప్రజల ఆలోచనల్లో స్పష్టమైన మార్పు రావాల్సి ఉంటుంది. అది హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ మెరుగుపడినప్పుడే వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్ పురోగమిస్తోంది.  


లింగ సమానత్వంలో వెనుకడుగే.. కానీ ముందుకెళ్తున్నాం  ! 


స్త్రీ, పురుష సమానత్వం విషయంలో భారత్‌ అట్టడుగున 135వ స్థానంలో ఉంది. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలకు సంబంధించి గతంతో పోలిస్తే 5 ర్యాంకులు ఎగబాకినా ప్రపంచంలో ఇంకా చివరి స్థానాల్లోనే భారత్‌ ఉన్నట్లు ప్రపంచ ఆర్థిక ఫోరానికి (డబ్ల్యూఈఎఫ్‌) చెందిన జండర్‌ గ్యాప్‌ రిపోర్ట్‌ - 2022లో పేర్కొన్నారు. మొత్తం 146 దేశాల సూచీలో భారత్‌ తరవాత స్థానాల్లో 11 దేశాలు మాత్రమే ఉన్నాయి. అందులో అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, కాంగో, ఇరాన్‌,   చివరి   స్థానాల్లో ఉన్నాయి.2021తో పోలిస్తే ఆర్థిక రంగంలో భాగస్వామ్యం, అవకాశాల విషయంలో చాలా సానుకూల మార్పులు ఉన్నాయి. 


పర్యాటక సూచీల్లో భారత్ మెరుగు !


ప్రపంచ దేశాలకు ప్రయాణాలు, అంతర్జాతీయ పర్యాటక అభివృద్ధి సూచీలో దక్షిణాసియాలో భారత్ అగ్రగామిగా ఉంది. ఇక,మొత్తంగా చూస్తే ప్రపంచ దేశాలకు ప్రయాణాలు, అంతర్జాతీయ పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్‌ 54వ స్థానంలో నిలిచింది. 2019లో 46 స్థానాన్ని దక్కించుకున్న మన దేశం ఎనిమిది స్థానాలు తగ్గిపోయి 54వ స్థానానికి పడిపోయింది. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్‌మెంట్ ఇండెక్స్ పేరుతో మొత్తం 117 దేశాల్లో పర్యాటక రంగ పురోగతిని సమీక్షించి ఈ నివేదిక రూపొందించారు. 


పయనం ప్రారంభించిన తర్వాత ఎంతో కొంత మందుకు వెళ్లడం సహజం.  మనం ఎలా వెళ్తున్నామన్నదానిపై వేగం ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా..  భారత్‌ పయనం.. విలువల పునాదులపై నడుస్తోంది. అందుకే ఆలస్యంగా అయినా  సుస్ధిరంగా ముందుకు సాగుతోంది.