Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు అదుర్స్ అనిపిస్తున్నారు. వరుసగా పతకాల పంట పండిస్తున్నారు. బ్యాడ్మింటన్‌లో ఇంతకు ముందే పీవీ సింధు స్వర్ణం గెలవగా ఇప్పుడు ఆమెకు లక్ష్యసేన్ తోడయ్యాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం ముద్దాడాడు. మలేసియా షట్లర్ యంగ్‌ను 19-21, 21-9, 21-16 తేడాతో చిత్తు చేశాడు. తొలి గేమ్‌లో పోరాడి ఓడినా వెంటనే తేరుకొని కోట్లాది భారతీయులను సంతోషపెట్టాడు. 20 ఏళ్ల ఈ కుర్రాడు టీమ్‌ఇండియాకు 20వ బంగారు పతకం తీసుకురావడం ప్రత్యేకం.
తొలి గేమ్ ఓడినా!
ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్ ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. తొలి గేమ్‌లో 5-4 తేడాతో స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో పుంజుకున్న యంగ్ 7-7తో స్కోరు సమం చేశాడు. 11-9తో విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డారు. 18-18, 19-19తో పోటీ పడ్డారు. ఈ క్రమంలో యంగ్ ఓ అద్భుతమైన క్రాస్‌కోర్టు స్మాష్‌తో 21-19తో గేమ్ గెలిచేశాడు.
Also Read: పీవీ సింధుకు గోల్డ్! ప్రత్యర్థిని ఉరుకులు పెట్టించిన తెలుగుతేజం
దూకుడు పెంచి
రెండో గేమ్‌లోనూ లక్ష్య 4-6తో వెనకబడ్డాడు. అయితే వెంటనే పుంజుకున్నాడు. 11-9తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. వరుసగా 10 పాయింట్లు సాధించి 21-9తో రెండో గేమ్ కైవసం చేసుకున్నాడు. కీలకమైన మూడో గేమ్‌లో లక్ష్య జోరు మరింత పెంచాడు. 15-12తో దూసుకెళ్లాడు. ప్రత్యర్థి ర్యాలీ గేమ్ మొదలు పెట్టినా 19-15తో గేమ్ పాయింట్‌కు చేరువయ్యాడు. ఓ చక్కని క్రాస్‌కోర్టు షాట్‌తో మ్యాచును ముగించాడు.