Indian Special Forces:  ప్రపంచ దేశాలలో ఉన్న అత్యంత శక్తిమంతమైన మిలటరీల్లో భారత్‌ ఒకటి. ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశమైన (విస్తీర్ణం ప్రకారం) భారత్‌లో త్రివిధ దళాలైన సైన్యం, వాయుసేన, నావికాదళంతో పాటు ప్రపంచంలోనే మేటిగా నిలిచే కొన్ని ప్రత్యేక బలగాలు ఉన్నాయి. ఈ 9 బలగాలు ప్రపంచంలో ఉన్న ఏ సైన్యానికైనా, సమస్యకైనా సవాల్ విసిరే సత్తా కలిగినవి. అవేంటో ఒకసారి చూద్దాం. వీటి గురించి తెలుసుకున్నాక ప్రతి భారతీయుడు గర్వంతో ఉప్పొంగిపోతాడు.


1. మార్కోస్ 


మార్కోస్ (మెరైన్ కమాండోస్)ను 1987లో భారత నావికా దళం ఏర్పాటు చేసింది. తీవ్రవాద అణిచివేత, యుద్ధం సహా అత్యవసర పరిస్థితుల్లో ఈ దళాన్ని డైరెక్ట్ యాక్షన్‌లోకి దించుతారు.


ఇందులో చేరే కమాండోలకు ప్రపంచంలోనే అత్యంత కఠిన శిక్షణ ఇస్తారు. కమాండోలు శారీరక, మానసిక దృఢత్వం సాధించేలా ట్రైన్ చేస్తారు. 


ఈ దళాన్ని తీవ్రవాదులు.. "దాడివాలా ఫౌజ్" అని పిలుస్తారు. అంటే 'గడ్డం ఉన్న సైన్యం'. ఎందుకంటే వీరు ప్రత్యేక ఆపరేషన్ల కోసం ఎప్పుడూ ప్రజల్లో కలిసిపోయి మారువేషాల్లో తిరుగుతారు. MARCOS బలగం ఏ రకమైన భూభాగంలోనైనా కార్యకలాపాలు చేయగలదు. కానీ ప్రధానంగా సముద్ర కార్యకలాపాలలో వీళ్లకు తిరుగులేదు.


2. పారా కమాండోలు 


పారా కమాండోలు.. భారత సైన్యంలోని అత్యంత శిక్షణ పొందిన పారాచూట్ రెజిమెంట్‌లో భాగం. 1966లో ఈ విభాగం ఏర్పాటైంది. ఇది ప్రత్యేక దళాలలోనే అతిపెద్ద విభాగం. భారత సైన్యానికి చెందిన పారాచూట్ యూనిట్లు ప్రపంచంలోని పురాతన వైమానిక యూనిట్లలో ఒకటి.




శత్రువులను వెనుక నుండి దాడి చేయడమే పారాచూట్ రెజిమెంట్ ప్రధాన లక్ష్యం. శత్రువుల మొదటి రక్షణ శ్రేణిని నాశనం చేయడానికి, శత్రు సైన్యం వెనుక బలగాలను త్వరగా మోహరించడంలో వీళ్లకు వీరే సాటి.


1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థానీల నుంచి టైగర్ శిఖరాన్ని భారత్ పొందడంలో పారా కమాండోలు కీలక పాత్ర పోషించారు.


3. ఘటక్ ఫోర్స్


'ఘటక్ ఫోర్స్'.. ఘటక్ అంటే హిందీలో 'కిల్లర్' అని అర్ధం. ఈ పదాతిదళం శత్రువలను హతమార్చడంలో అందెవేసిన చేయి. బెటాలియన్‌కు ముందు ఉండి ఈ దళం దాడి చేస్తుంది. భారత సైన్యంలోని ప్రతి పదాతిదళ బెటాలియన్‌కు ఒక ప్లాటూన్ ఉంటుంది. ఘటక్ ప్లాటూన్‌లో అత్యంత శారీరక దృఢత్వం కలిగిన సైనికులను మాత్రమే చేర్చుకుంటారు.




ఘటక్ సైనికులు సుశిక్షితులైనవారు. అత్యుత్తమ ఆయుధాలు కలిగి ఉంటారు. తీవ్రవాద దాడులు, తిరుగుబాటు చర్యలను ఎదుర్కోవడానికి వీళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.


4. కోబ్రా 


కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్)..  భారత్‌లోని నక్సలిజాన్ని ఎదుర్కోవడానికి ఏర్పడిన CRPF (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్)కు చెందిన ప్రత్యేక విభాగం. గెరిల్లా యుద్ధంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన కొన్ని భారతీయ ప్రత్యేక దళాలలో ఇది ఒకటి.




2008లో ప్రారంభమైనప్పటి నుంచి ఇది భారత దేశంలో ఉన్న అనేక నక్సలైట్ గ్రూపులను విజయవంతంగా తుడిచిపెట్టేసింది. ఇది భారత్‌లోని అత్యుత్తమ పారామిలిటరీ దళాలలో ఒకటి.


5. ఫోర్స్ వన్


ముంబయిలో జరిగిన 26/11 తీవ్రవాద దాడుల తర్వాత 2010లో 'ఫోర్స్ వన్' ఉనికిలోకి వచ్చింది. ముంబయి నగరాన్ని తీవ్రవాద దాడుల నుంచి రక్షించడమే ఈ ప్రత్యేక ఎలైట్ ఫోర్స్ ప్రధాన ధ్యేయం.




ఈ దళం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనది. ఉగ్రదాడి జరిగిన 15 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ఈ దళం ప్రతిస్పందిస్తుంది.


6. ప్రత్యేక ఫ్రాంటియర్ ఫోర్స్ 


1962 చైనా-భారత యుద్ధం తర్వాత ఈ దళం ఏర్పడింది. చైనాతో మరొక యుద్ధం జరిగినప్పుడు డ్రాగన్ దేశం నడిపే రహస్య కార్యకలాపాలను తెలుసుకునేందుకు ఈ దళాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ దళాన్ని దాని కోసం కంటే స్పెషల్ ఆపరేషన్స్, తిరుగుబాటు ఆపరేషన్ల కోసం వినియోగించారు.




ఈ రహస్య పారామిలిటరీ ప్రత్యేక దళం RAW కింద పనిచేస్తుంది. క్యాబినెట్ సెక్రటేరియట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ ద్వారా నేరుగా ప్రధాన మంత్రికి మాత్రమే నివేదిస్తుంది. ఇది ఎంత పకడ్బందీగా ఏర్పడిందంటే దీని గురించిన పూర్తి వివరాలు సైన్యానికి కూడా తెలియదు.


7. నేషనల్ సెక్యూరిటీ గార్డ్


నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అనేది భారత్‌కు చెందిన ప్రధాన ఉగ్రవాద వ్యతిరేక దళం. NSG.. VIPలకు భద్రతను అందిస్తుంది. విధ్వంస నిరోధక తనిఖీలను నిర్వహిస్తుంది. ఉగ్రవాద బెదిరింపులకు స్పందించి, వాటిని నిరోధించే బాధ్యత వీరిదే.




ఇందులో ఎంపిక ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. 70-80 శాతం డ్రాప్ అవుట్ రేటు ఉందంటే ఎంత కఠినంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 7500 మంది సిబ్బందితో ఉన్న బలమైన NSGని స్పెషల్ యాక్షన్ గ్రూప్ (SAG), మరియు స్పెషల్ రేంజర్స్ గ్రూప్ (SRG)గా సమానంగా విభజించారు.


8. గరుడ్ కమాండో ఫోర్స్


2004లో ఏర్పాటైన 'గరుడ్ కమాండో ఫోర్స్' భారత వాయుసేనకు చెందిన ఓ ప్రత్యేక దళాల విభాగం. ఇందులో శిక్షణ చాలా సుదీర్ఘంగా ఉంటుంది. శిక్షణ మొత్తం వ్యవధి సుమారు 3 సంవత్సరాలు.




క్లిష్టమైన వైమానిక దళ స్థావరాలను రక్షించడం, విపత్తుల సమయంలో రెస్క్యూ ఆపరేషన్ చేయడం, వైమానిక కార్యకలాపాలకు మద్దతుగా ఇతర ఆపరేషన్లలో పాల్గొనడం వంటి బాధ్యతలను ఈ గరుడ్ కమాండో ఫోర్స్ నిర్వహిస్తోంది. 


9. ద స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్


'స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్' అనేది భారత ప్రభుత్వ భద్రతా దళం. ఇది భారత ప్రధాని, మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు రక్షణ బాధ్యత వహిస్తుంది.




ఈ బృందం నిఘా నివేదికలను సేకరించి, ముప్పులను అంచనా వేయాలి.  రక్షణ కల్పించాలి. రాజీవ్ గాంధీ హత్య తర్వాతి నుంచి వీరి ట్రాక్ రికార్డ్ అమోఘంగా ఉంది. అప్పటి నుంచి ఏ ప్రధాన మంత్రిపైనా దాడులు జరగలేదు.


Also Read: Women Freedom Fighters : బ్రిటిష్ వారికే దడ పుట్టించిన మహిళా స్వాతంత్ర్య సమరయోధులు - వీరి గురించి ఎక్కువ మందికి తెలియదు ! ఇవిగో వారి విశేషాలు


Also Read: Stars of Science : ప్రపంచగతిని మార్చిన భారత శాస్త్రవేత్తలు - సైన్స్ ప్రపంచంలో మన ధృవతారలు వీరే !