KomatiReddy Rajagopal Reddy Resignation Live Updates: మునుగోడు ఎమ్మెల్యే పదవికి ఇటీవల రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి సమర్పించారు. ఇటీవల ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ మాజీ నేత రాజీనామా చేసినట్లు ప్రకటించారు. నేటి ఉదయం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి, స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను సమర్పించారు. ఆ రాజీనామా లేఖకు స్పీకర్ పోచారం వెంటనే ఆమోదం తెలిపారు.
ఇటీవల రాజీనామా నిర్ణయం, నేడు స్పీకర్‌కు లేఖ..
తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించి పార్టీ శ్రేణులకు షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నానని అనుచరులతో భేటీ తర్వాత ప్రకటించారు. తన రాజీనామాపై చాలా కాలం నుంచి చర్చ నడుస్తోందన్నారు. ఇంకా దీన్ని సాగ దీసే ఉద్దేశం లేదని... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుంటే ప్రజల సమస్యలు పరిష్కారం కావన్నారు. మూడున్నర సంవత్సరాలుగా నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడదామని చాలా సార్లు చూశానని వెల్లడించారు. కానీ ప్రయోజనం కనిపించలేదన్నారు. ఇప్పుడు మునుగోడుకు ఉపఎన్నికలు (Munugodu By Elections) వస్తేనే నిధులు వస్తాయని చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు . అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని రాజగోపాల్ రెడ్డి తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. నేడు స్పీకర్ పోచారంను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖను స్పీకర్ ఆమోదించారు.
21న బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి..
తాను ఈ నెల 21న అధికారంగా బీజేపీలో చేరుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన ఢిల్లీలో బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్‌లను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చౌటుప్పల్‌లో బహిరంగ సభ ఉండే అవకాశం ఉందని అన్నారు. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేశానని చెప్పారు. 2014 తర్వాత పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా సరే కష్టపడ్డానని చెప్పారు. అయినా తనకు ప్రాదాన్యం లేదని అన్నారు. అందుకే, ప్రధాని మోదీ వల్ల దేశాభివృద్ధి సాధ్యమని తాను బాగా నమ్ముతున్నానని అన్నారు. Also Read: Rajagopal Reddy: బీజేపీలో చేరే డేట్ ఫిక్స్, రాజగోపాల్ రెడ్డి వెల్లడి - రేవంత్‌పైన తీవ్ర విమర్శలు
తెలంగాణలో కుటుంబ పాలన ఉందన్న రాజగోపాల్ రెడ్డి
రాజీనామా ప్రకటన సమయంలో టీఆర్ఎస్ సర్కార్‌పై కోమటిరెడ్డి తీవ్ర విమర్శలుచేశారు. ప్రతి విషయంలో కూడా ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేసిందని.. రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. ఒక ఫ్యామిలీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం కుటుంబం కనుసన్నల్లో పని చేస్తోందన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోయానన్నారు. ఇంకా 18 నెలల పదవీ కాలం ఉన్నప్పటికీ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. నిధులు వస్తాయని అభివృద్ధి చేస్తారన్న ఆశతో ప్రజలు ఉన్నారు. ఈ రాజీనామా అంశాన్ని కూడా ప్రభుత్వ అనుకూల మీడియా తెరపైకి తీసుకొచ్చిందన్నారు.