PV Sindhu Wins Gold: తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టింది! అశేష భారతావనిని మరోసారి మురిపించింది. బర్మింగ్‌హామ్‌లో తన రాకెట్‌ పవర్‌ చూపించింది. కామన్వెల్త్‌ క్రీడల్లో విలువైన స్వర్ణ పతకం ముద్దాడింది. ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్‌, కెనడా షట్లర్‌ మిచెల్‌ లీని 21-15, 21-13 తేడాతో చిత్తు చేసింది. వీరిద్దరూ గతంలో 10 సార్లు తలపడగా 8 విజయాలతో సింధూదే పైచేయి కావడం గమనార్హం. ఈ ఏడాది వీరిద్దరూ రెండు సార్లు తలపడగా రెండుసార్లూ తెలుగమ్మాయినే విజయం వరించింది.



కోర్టంతా తిప్పింది!


కోర్టులో అడుగుపెట్టిన క్షణం నుంచే పీవీ సింధు దూకుడుగా ఆడింది. తొలి గేమ్‌లో 9-8తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత వరుస పాయింట్లతో 14-8తో పై చేయి సాధించింది. ఈ క్రమంలో మిచెల్‌ 20 షాట్ల ర్యాలీతో ఆమెను నిలువరించే ప్రయత్నం చేసింది. అయినా సింధూ 16-12తో ముందుకెళ్లింది. 18-15తో గేమ్‌పాయింట్‌కు వచ్చేసింది. 21-15తో గెలిచేసింది. రెండో గేమ్‌లోనూ తెలుగు తేజమే 3-2తో ముందంజ వేసింది. బేస్‌లైన్‌ వద్ద ఆడుతూ 7-3తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. 11-6తో విరామం తీసుకుంది. లీ వరుస తప్పిదాలు చేయడంతో 19-13తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. వరుసగా రెండు పాయింట్లు సాధించి 21-13తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ గెలిచేసింది.


4 ప్లేస్‌కు భారత్‌


సింధూ స్వర్ణంతో పాయింట్ల పట్టికలో భారత్‌ ఓ అడుగు ముందుకేసింది. న్యూజిలాండ్‌ను దాటేసి నాలుగో స్థానానికి చేరుకుంది. 19 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలతో మొత్తం 56 పతకాలు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడా మనకన్నా ముందున్నాయి.