దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న కోవిడ్ కేసులు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 27,176 కోవిడ్ పాజటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 3,33,16,755కి పెరిగింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో నిన్న ఒక్క రోజే కోవిడ్ కారణంగా 284 మంది మృతి చెందారు. దీంతో కలిపి కోవిడ్ 284 మంది మృతుల సంఖ్య 4,43,497కి పెరిగింది. ఇక గత 24 గంటల వ్యవధిలో 38,012 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో రికవరీల సంఖ్య 3,25,22,171కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,51,087 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కోవిడ్ రికవరీ రేటు 97.62 శాతంగా.. క్రియాశీల రేటు 1.05 శాతంగా ఉంది.
కేరళలో 15,876 కరోనా కేసులు..
కేరళలో కోవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 15,876 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 129 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 3,530 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దేశవ్యాప్తంగా నమోదయ్యే కోవిడ్ కేసుల్లో సగానికిపైగా ఒక్క కేరళలోనే ఉండటం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.
నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 61,15,690 మంది కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటివరకు 75,89,12,277 కోవిడ్ టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.