సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసులో నిందితుడి గురించి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఆర్టీసీఎండీ సజ్జనార్ కూడా తమ సిబ్బందికి ఆదేశాలిచ్చారు.  నిందితుడి  ఆచూకి లభిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని  ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసి ప్రాంగణాల్లో, బస్సుల్లో నిందితుడు ప్రయాణించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన దిశ కేసు గురించి మాట్లాడారు. అయితే సజ్జనార్ మళ్లీ రావాలంటూ.. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు కోరుతున్నారు.





సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి హత్యాచార నిందితుడిపై రూ.10 లక్షల రివార్డ్ ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్ అందిస్తామని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. పోలీసులు నిందితుడి ఆనవాళ్లను విడుదల చేశారు. పది బృందాలను ఏర్పాటు చేసి రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.  ప్రస్తుతం హైదరాబాద్,  నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై దారుణంగా హతమార్చిన ఘటనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.  తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. ఇదివరకే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని మంత్రి కేటీఆర్ ట్వీట్ పై సైతం దుమారం రేగింది. మంత్రి చెప్పినా నిందితుడు రాజు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదంటూ ఆ ప్రాంత వాసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ శాఖ ఇదివరకే హైదరాబాద్ సరిహద్దు జిల్లాల్లో నిందితుడు రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో భారీ రివార్డు ప్రకటించారు. రూ.10 లక్షల మేర రివార్డ్ ప్రకటించడంతో పాటు నిందితుడి ఫొటో, వివరాలను సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.


సింగరేణి కాలనీ బాలిక హత్యాచార కేసు నిందితుడి వివరాలు ఇవే..   


1) వయసు 30 ఏళ్లు 
2) ఎత్తు- సుమారుగా 5.9 అడుగులు
3) జుట్టు-  పెంచిన జుట్టును రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాడు
4) నిందితుడి మెడకు ఎరుపు రంగు కండువా ధరించాడు. తలపై క్యాప్ ఉంది 
5) రాజు రెండు చేతుల మీద మౌనిక అనే పేరుతో టాటూ ఉంటుంది
6) అతనికి గడ్డం కేవలం గవద వద్ద మాత్రమే ఉంది
7) ఫార్మల్ షర్ట్ మరియు ఫార్మల్ పాయింట్ ధరించి ఉన్నాడు
8) మద్యం సేవించే అలవాటు ఉంది, రోడ్ల పక్కన, బస్టాండ్ ప్రాంగణంలో నిద్రిస్తుంటాడు 


పొరపాటుగా ట్వీట్ చేశా..


సైదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆరేళ్ల బాలికపై హత్యాచార ఘటనలో నిందితుడు పట్టుబడ్టట్టు గతంలో తాను చేసిన ట్వీట్‌ను మంత్రి కేటీఆర్‌ ఉప సంహరించుకున్నారు. సమాచారలోపంతో నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేసినట్టు పొరపాటున తాను చేసిన ప్రకటన పట్ల మంత్రి కేటీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడని, అతడ్ని పట్టుకునేందుకు హైదరాబాద్‌ నగర పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. నిందితుడు త్వరగా అరెస్టై, తగిన శిక్షపడటం ద్వారా బాధితులకు త్వరగా న్యాయం జరగాలని కోరుకుందామని మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు.


 


Also Read: Malla Reddy Comments: ఆ రేపిస్టును ఎన్‌కౌంటర్ చేసి పారేస్తాం.. మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన