ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్నలకు ఎదురవుతున్న సమస్యలపై పోరాడటానికి టీడీపీ చేపట్టిన ‘రైతు కోసం తెలుగుదేశం’ కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం ఐదు రోజుల పాటు జరగనున్న నిరసన కార్యక్రమాలు.. రాయలసీమ జిల్లాలతో ఆరంభమయ్యాయి. నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా ఎడ్ల బళ్లు, ట్రాక్టర్లపై ర్యాలీగా వెళ్లి, కూరగాయలు, ఇతర పంటలను నేలపై పోసి నిరసన తెలిపారు. రైతులకు న్యాయం చేయాల్సిందిగా తహసీల్దారు కార్యాలయాల్లో వినతిపత్రాలను అందించారు. 


కర్నూలు జిల్లాలో ఇలా.. 
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రైతులకు న్యాయం జరగాలనే టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, నంద్యాల పార్లమెంటు అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పత్తికొండ నియోజకవర్గంలో తహసీల్దారు కార్యాలయం ముందు కూరగాయలను నేలపై పోసి నిరసన తెలిపారు. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రైతులతో కలసి ట్రాక్టర్లపై తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. రైతుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా తహసీల్దారుకు వినతిపత్రం అందించారు. బనగానపల్లె, డోన్‌, ఆలూరు నియోజకవర్గాల్లో పార్టీ నేతల ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.  



కడపలో నిరసన కార్యక్రమాలు.. 
కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. పులివెందుల పడా కార్యాలయంలో కలెక్టరుకు వినతిపత్రం అందించారు. కమలాపురం నియోజకవర్గం చెన్నూరులో కేసీ కెనాల్‌ ఆయకట్టు వద్ద రైతులతో నేతలు మాట్లాడారు. వారి సమస్యలపై చర్చించారు. పులివెందుల, కడప ఏడు రోడ్ల కూడలి, బద్వేలు, చెన్నూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల్లో టీడీపీ నేతల నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రొద్దుటూరు తహసీల్దారు కార్యాలయం వద్ద టమాటాలను నేలపై పారబోసి నిరసన తెలియజేశారు. 


అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున.. 
అనంతపురం జిల్లాల్లో తెలుగు దేశం నేతలు రైతన్నలకు మద్దతుగా తమ గళం విప్పారు. రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గుంతకల్లులో ఎడ్లబండిపై ర్యాలీ నిర్వహించగా.. పెనుకొండలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. హిందూపురంలో స్థానిక నాయకులు రోడ్డుపై కూరగాయలు పడవేశారు. కళ్యాణదుర్గం, రాప్తాడు, శింగనమల, పుట్టపర్తిలో నేతలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. తహసీల్దార్లకు వినతిపత్రాలు అందించారు.  


Also Read: Cheating Couple : వీళ్ల వేషాలు చూసి ఫ్లాటయితే బుక్కయినట్లే ! ఈ జంట ఎన్ని కోట్లకు జనాల్ని ముంచారో తెలుసా..?


ALso Read: Perni Nani : సినిమా పెద్దల సూచనలతోనే ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకాలు - ఏపీ సర్కార్ క్లారిటీ