ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో సిరీస్ ను యాపిల్ లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లు ఉన్నాయి. ఐఫోన్ 12 సిరీస్ కంటే మెరుగైన బ్యాటరీ లైఫ్, మంచి కెమెరాలు, సినిమాటిక్ వీడియో రికార్డింగ్ మోడ్ ఉన్నాయి. ఈ నాలుగు ఫోన్లు ఏ15 బయోనిక్ చిప్, ఐవోఎస్ 15తో మార్కెట్లోకి వచ్చాయి.
ఐఫోన్ 13 మినీ ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 128 జీబీ వేరియంట్ ధర రూ.69,900గా నిర్ణయించారు. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,900గానూ, 512 జీబీ వేరియంట్ ధర రూ.99,900గానూ ఉంది. ఐఫోన్ 12 మినీ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.74,900గా ఉంది. ఈ రకంగా చూస్తే దీని ధర ఐఫోన్ 12 మినీ కంటే తక్కువనే అనుకోవచ్చు.
ఐఫోన్ 13 ధర
ఇందులో కూడా మూడు వేరియంట్లే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 128 జీబీ వేరియంట్ ధర రూ.79,900గా ఉంది. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.89,900గానూ, 512 జీబీ వేరియంట్ ధర రూ.1,09,900గానూ ఉంది. ఐఫోన్ 12లో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.84,900గా ఉంది. ఇలా చూస్తే ఐఫోన్ 13 ధర కూడా ఐఫోన్ 12 కంటే తక్కువ ధరకే లాంచ్ అయిందనుకోవచ్చు.
ఐఫోన్ 13 ప్రో ధర
ఇందులో నాలుగు వేరియంట్లు అందించారు. వీటిలో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,19,900గా ఉంది. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,29,900గానూ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,49,900గానూ నిర్ణయించారు. ఇక టాప్ ఎండ్ అయిన 1 టీబీ వేరియంట్ ధర రూ.1,69,900గానూ ఉంది.
ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ధర
ఇందులో కూడా నాలుగు వేరియంట్లే అందుబాటులో ఉన్నాయి. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,29,900గా నిర్ణయించారు. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,39,900గానూ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,59,900గానూ ఉంది. ఇక టాప్ ఎండ్ అయిన 1 టీబీ వేరియంట్ కొనాలంటే రూ.1,79,900గా పెట్టాల్సిందే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇదే.
మనదేశంతో పాటు అమెరికా, యూకే, జపాన్, చైనా, ఆస్ట్రేలియా, కెనడాల్లో ఐఫోన్ 13 సిరీస్ కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సేల్ మాత్రం సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్లు
ఈ నాలుగు ఫోన్లలోనూ ఏ15 బయోనిక్ ప్రాసెసర్లనే కంపెనీ అందించింది. ఇందులో మొత్తం ఆరు కోర్లు ఉండనున్నాయి. పోటీ ఫోన్ల కంటే 50 శాతం ప్రభావవంతంగా ఈ ఫోన్లు పనిచేయనున్నాయని తెలుస్తోంది.
ఐఫోన్ 13 మినీలో 5.4 అంగుళాలు, ఐఫోన్ 13లో 6.1 అంగుళాలు, ఐఫోన్ 13 ప్రోలో 6.1 అంగుళాలు, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ లో 6.7 అంగుళాల డిస్ ప్లేలను అందించారు. ఐఫోన్ 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్ ల్లో యాపిల్ ప్రోమోషన్ 120 హెర్ట్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ ను అందించారు. అంటే ప్రో మోడల్స్ లో యూజర్ ఇన్ పుట్ ని బట్టి 10 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకు దీని రిఫ్రెష్ రేట్ మారుతూ ఉంటుంది. డాల్బీ విజన్, హెచ్ డీఆర్10, హెచ్ఎల్ జీ సపోర్ట్ కూడా ఇందులో అందించారు.
ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీల్లో ఫ్లాట్ ఎడ్జ్ అల్యూమినియం ఫ్రేమ్ లను అందించారు. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. కొత్తగా పింక్, బ్లూ, మిడ్ నైట్, స్టార్ నైట్, ప్రొడక్ట్ రెడ్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ల్లో సర్జికల్ గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్ ను అందించారు. ఇందులో నాలుగు కొత్త రంగులను యాపిల్ అందించింది. అవే గ్రాఫైట్, గోల్డ్, సిల్వర్, సియర్రా బ్లూ.
ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 మినీల్లో కొత్త వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. ఇవి గత ఐఫోన్లలోని కెమెరాల కంటే మెరుగ్గా ఉండనున్నాయి. నైట్ మోడ్ కూడా వేగంగా పనిచేయనుంది. ఇందులో 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. దీంతోపాటు ఇందులో సినిమాటిక్ వీడియో మోడ్ కూడా ఉంది. డైరెక్టర్స్ ఆఫ్ ఫొటోగ్రఫీ క్రియేటివ్ చాయిస్ కు తగ్గట్లు ఈ కెమెరాలను రూపొందించినట్లు యాపిల్ తెలిపింది.
ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ల్లో 77 ఎంఎం టెలిఫొటో కెమెరాను అందించారు. దీంతోపాటు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇందులో ఉంది. ట్రైపోడ్ తో ఉపయోగిస్తే మెరుగైన షాట్లను దీని ద్వారా తీయవచ్చని యాపిల్ అంటోంది. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13ల్లో వెనకవైపు రెండు కెమెరాలు ఉండగా, ప్రో మోడళ్లలో మూడు కెమెరాలు ఉన్నాయి.
యాపిల్ వీటి బ్యాటరీ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఐఫోన్ 13 పూర్తి రోజు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుందని పేర్కొంది. ఇది ఐఫోన్ 12 కంటే రెండున్నర గంటలు ఎక్కువ. అలాగే ఐఫోన్ 12 మినీ కంటే ఐఫోన్ 13 మినీ గంటన్నర ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ను అందించనుంది.
ఐఫోన్ 12 ప్రో కంటే గంటన్నర ఎక్కువ బ్యాకప్ ను ఐఫోన్ 13 ప్రో అందించనుంది. ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ కంటే రెండున్నర గంటల ఎక్కువ బ్యాకప్ ను ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అందించనుంది. ఈ అన్ని ఫోన్లలోనూ 5జీ సపోర్ట్ ఉంది. ఎక్కువ బ్యాండ్లను సపోర్ట్ చేయడానికి ఇందులో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాంటెన్నాలు, రేడియో కాంపొనెంట్లను అందించారు.
Also Read: Apple New iPad, iPad Mini: యాపిల్ కొత్త ఐప్యాడ్లు వచ్చేశాయ్.. ఈసారి కాస్త బడ్జెట్ ధరలోనే!
Also Read: Apple Watch Series 7: యాపిల్ కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది.. అదిరిపోయే హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు!
Also Read: ఈ సంవత్సరం వన్ ప్లస్ లాంచ్ చేయనున్న చివరి ఫోన్ ఇదే.. ధర కూడా లీక్!