యాపిల్ వాచ్ సిరీస్ 7ను యాపిల్ త‌న తాజా ఈవెంట్లో లాంచ్ చేసింది. 2015లో యాపిల్ మొట్ట‌మొద‌టి వాచ్ ను లాంచ్ చేయ‌గా, ఇది ఆ వాచ్ ల్లో 8వ సిరీస్. గ‌తేడాది లాంచ్ అయిన సిరీస్ 6 కంటే అప్ గ్రేడెడ్ వెర్ష‌న్ గా ఈ వాచ్ సిరీస్ ను కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో 1.7 ఎంఎం మందం ఉన్న స‌న్న‌ని అంచుల‌ను అందించారు.


యాపిల్ వాచ్ 7 సిరీస్ ధ‌ర‌
యాపిల్ వాచ్ సిరీస్ 7 జీపీఎస్ ఓన్లీ వేరియంట్ ధ‌ర అమెరికాలో 399 డాల‌ర్లుగా(మ‌న‌దేశ క‌రెన్సీలో సుమారు రూ.29,400) నిర్ణ‌యించారు. యాపిల్ వాచ్ సిరీస్ 7 జీపీఎస్ + సెల్యులార్ ఆప్ష‌న్ ధ‌ర 499 డాల‌ర్లుగా(సుమారు రూ.36,800) ఉంది. మిడ్ నైట్, స్టార్ లైట్, గ్రీన్, న్యూ బ్లూ, ప్రొడ‌క్ట్ రెడ్ రంగుల్లో ఈ వాచ్ కొనుగోలు చేయ‌వ‌చ్చు.


యాపిల్ వాచ్ సిరీస్ 7 మ‌న‌దేశంలో ఎంత ధ‌ర‌లో అందుబాటులోకి రానుందో తెలియరాలేదు. అమెరికాలో కూడా ఈ వాచ్ కు సంబంధించిన సేల్ తేదీని కంపెనీ ప్ర‌క‌టించ‌లేదు.


యాపిల్ వాచ్ 7 సిరీస్ స్పెసిఫికేష‌న్లు, ఫీచ‌ర్లు
యాపిల్ వాచ్ సిరీస్ 7లో 41ఎంఎం, 45ఎంఎం కేస్ ఆప్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆల్వేస్ ఆన్ రెటీనా డిస్ ప్లేను అందించారు. యాపిల్ వాచ్ సిరీస్ 6 కంటే 70 శాతం ప్ర‌కాశ‌వంతంగా వీటి డిస్ ప్లేలు ఉండ‌నున్నాయి.


యాపిల్ వాచ్ సిరీస్ 6 కంటే 20 శాతం ఎక్కువ‌గా వీటి స్క్రీన్ ఏరియా ఉండేలా యాపిల్ డిజైన్ చేసింది. వీటి అంచులు కూడా 40 శాతం స‌న్న‌గా ఉన్నాయి.


ఇందులో ఎన్నో ముఖ్య‌మైన హెల్త్, ఫిట్ నెస్ ఫీచ‌ర్లు కూడా అందించారు. ఎస్పీఓ2 ట్రాకింగ్ కూడా దీని ద్వారా చేయ‌వ‌చ్చు. ఎలక్ట్రికల్ హార్ట్ రేట్ సెన్సార్ ద్వారా హార్ట్ రేట్ ను కూడా ఇది లెక్కించ‌గ‌ల‌దు. ఈసీజీ రిపోర్టును అందించే ఏఎఫ్ఐబీ ఫీచ‌ర్ కూడా ఇందులో ఉంది.


వాచ్ ఓఎస్ 8 ఆప‌రేటింగ్ సిస్టంపై ఈ వాచ్ లు ప‌నిచేయ‌నున్నాయి. ఈ కొత్త ఆప‌రేటింగ్ సిస్టంను యాపిల్ ఈ సంవ‌త్స‌రం జూన్ లో జరిగిన డబ్ల్యూడ‌బ్ల్యూడీసీ 2021 ఈవెంట్లో ఈ ఆప‌రేటింగ్ సిస్టం లాంచ్ చేశారు. మెరుగైన స్లీప్ ట్రాకింగ్, స్లీప్ రెస్పిరేష‌న్ రేట్, స్లీప్ ట్రెండ్స్ ఫీచ‌ర్లు కూడా ఇందులో ఉన్నాయి. 


ఒక్క‌సారి చార్జ్ చేస్తే 18 గంట‌ల పాటు ఈ వాచ్ సిరీస్ ప‌నిచేయ‌నుంది. గ‌తేడాది లాంచ్ అయిన యాపిల్ వాచ్ సిరీస్ 6 కంటే 33 శాతం వేగంగా ఇవి చార్జ్ కానున్నాయి.


ఐపీ6ఎక్స్ రేటింగ్ ను వీటిలో అందించారు. డ‌బ్ల్యూఆర్50 వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్లు కూడా ఇందులో ఉన్నాయి. యూఎస్ బీ టైప్-సీ కేబుల్ ను కూడా దీంతోపాటు అందించారు.


Also Read: ఈ సంవ‌త్స‌రం వ‌న్ ప్ల‌స్ లాంచ్ చేయ‌నున్న‌ చివ‌రి ఫోన్ ఇదే.. ధ‌ర కూడా లీక్!


Also Read: Samsung New Phone: శాంసంగ్ కొత్త ఫోన్ వ‌చ్చేసింది.. ఆ విష‌యంలో మాత్రం ఇంకా సస్పెన్స్!


Also Read: Nokia C01 Plus: రూ.6 వేల‌లోపే నోకియా కొత్త ఫోన్.. ఆండ్రాయిడ్ 11తో లాంచ్.. జియో యూజ‌ర్ల‌కు ఆఫ‌ర్ కూడా!