సరిహద్దుల్లో నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం భారతదేశం, చైనాలు మరోసారి ఉన్నత స్థాయి చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే భారత్, చైనాల మధ్య 13వ విడత చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లోని హాట్ స్ప్రింగ్ ప్రాంతం వద్ద బలగాల ఉపసంహరణ గురించి చర్చించేందుకు చైనా మిలటరీకి ఆహ్వానం పంపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (LAC), తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న సైనిక ప్రతిష్టంభన పరిష్కారం కోసం ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
ఇప్పటికి 12 సార్లు చర్చలు..
తూర్పు లద్దాఖ్‌లో గతేడాది మే నుంచి చైనా, ఇండియా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు తమ సైన్యాలను మోహరించాయి. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇప్పటికే ఇరు దేశాలు 12 సార్లు ఉన్నత స్థాయిలో సైనిక, దౌత్య చర్చలను జరిపాయి. చివరిసారిగా ఈ ఏడాది జూలై నెలలో ఇండియా, చైనా దేశాల సైనిక కమాండర్లు భేటీ అయ్యారు. అంతకుముందు 2020 మే నెలలో జరిగిన భేటీలో పాంగాంగ్ సరస్సు, గాల్వాన్ లోయ, గోగ్రా వద్ద సైనిక బలగాల ఉపసంహరణ గురించి చర్చించారు.
వివాదాస్పద ప్రాంతాలుగా దెమ్‌చోక్, ట్రిగ్‌హైట్స్..
దెమ్‌చోక్, ట్రిగ్‌హైట్స్‌లను వివాదాస్పద ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్లు ఇండో చైనా జాయింట్ వర్కింగ్ గ్రూప్ గతంలో ప్రకటించింది. వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తతలు పెరగడంతో ఇటీవల భారత్ నార్తన్ కమాండ్‌లోని ఉగ్రవాద వ్యతిరేక దళాలను వాస్తవాధీన రేఖ వద్దకు తరలించిన విషయం తెలిసిందే. సరిహద్దులకు దళాల చేరవేతలు జరుగుతున్నా.. ఇరు పక్షాలు ముఖాముఖీ తలపడేంత ఉద్రిక్తత లేదని అధికారులు చెబుతున్నారు.
Also Read: Explosion Outside Kabul airport: కాబుల్ విమానాశ్రయం వద్ద పేలుడు..
Also Read: Covishield Vaccine: కోవిషీల్డ్ వ్యాక్సిన్ 84 రోజుల గ్యాప్‌పై కేంద్రం పునరాలోచన.. వ్యవధి తగ్గే ఛాన్స్