India Canada Tensions: 



విదేశీ హస్తం ఉందంటూ ఆరోపణలు..


ఖలిస్థాన్ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడా మధ్య చిచ్చు పెట్టింది. పరస్పర ఆరోపణలతో వాతావరణం వేడెక్కుతోంది. ఈ హత్యలో కచ్చితంగా భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. అంతర్జాతీయంగానూ విమర్శలు ఎదుర్కొంటున్నారు ట్రూడో. ఈ క్రమంలోనే కెనడాలోని New Democratic Partyకి చెందిన ఎంపీ జగ్‌మీత్ సింగ్ (MP Jagmeet Singh) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్ హత్య వెనకాల కచ్చితంగా విదేశీ హస్తం ఉందని తేల్చి చెప్పారు. కెనడా నిఘా వర్గాలు ఇదే విషయాన్ని చెప్పాయని స్పష్టం చేశారు. ఆ నిఘా వర్గాల సమాచారం ఆధారంగానే జస్టిన్ ట్రూడో ఆ ఆరోపణలు చేశారని వివరించారు. భారత్‌పై ట్రూడో చేసిన వ్యాఖ్యల్ని పరోక్షంగా సమర్థించారు జగ్‌మీత్ సింగ్. ప్రధాని పబ్లిక్‌గానే ఈ విషయం చెప్పారని తెలిపారు. కేవలం ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే ఆయన ఆరోపణలు చేశారని స్పష్టం చేశారు. 


"ప్రధాని జస్టిన ట్రూడో ఇప్పటికే పబ్లిక్‌గా ఓ విషయం వెల్లడించారు. కెనడాలో కెనడాకి చెందిన పౌరుడి హత్య జరిగింది. ఇందులో కచ్చితంగా విదేశీ హస్తం ఉందని నిఘా వర్గాలు చెప్పాయి. ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగానే ట్రూడో ఆ ఆరోపణలు చేశారు. అందుకే ప్రభుత్వంపై మేం కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాం. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. భారత్‌ పారదర్శకంగా ఉండాలన్న మా వాదనకు అమెరికా కూడా మద్దతునిస్తోంది. ఇదే మద్దతు ఇక ముందు కూడా ఉంటుందని ఆశిస్తున్నాం"


- జగ్‌మీత్ సింగ్, కెనడా ఎంపీ


భారత్‌లో వాళ్లపై వివక్ష: జగ్‌మీత్ సింగ్


ఇదే క్రమంలో భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో కొన్ని వర్గాల ప్రజలు తీవ్ర వివక్షకు గురై కెనడాకు వస్తున్నారని, ఇక్కడి ప్రజలతో తమ బాధల గురించి చెప్పుకుంటున్నారని అన్నారు. వీళ్లలో మహిళలతో పాటు వెనకబడిన వర్గాల పౌరులూ ఉన్నారని వెల్లడించారు. 


"భారత్‌లో కొన్ని వర్గాల వాళ్లు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. ముస్లింలతో పాటు వేరే వర్గాల వాళ్లూ ఉన్నారు. మహిళలు, వెనకబడిన తెగలకు చెందిన వాళ్లు, ఆదివాసీలు..ఇలా చాల మంది తమకు ఎదురైన అనుభవాలను ఇక్కడికి వచ్చి చెబుతున్నారు"


- జగ్‌మీత్ సింగ్, కెనడా ఎంపీ


భారత్‌, కెనడాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల అంశంపై శ్రీలంక భారత్‌కు మద్దతుగా మాట్లాడింది. కెనడా  ఉగ్రవాదులకు సురక్షితమైన ప్రదేశంగా , స్వర్గధామంగా మారిందని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రే పేర్కొన్నారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భారత్‌పై చేస్తున్న ఆరోపణలు దౌర్జన్యపూరితమైనవని, ఆధారాలు లేనివని ఆయన తెలిపారు. జస్టిన్ ట్రూడో అబద్ధాలు చెప్తున్నారని సబ్రే వెల్లడించారు. గతంలో శ్రీలంకలో మారణహోమం జరిగిందని కెనడా తప్పుడు ఆరోపణలు చేసిందని, అలాగే  ఇప్పుడు కూడా చేస్తోందని అన్నారు. ట్రూడో మాటలు తననేమీ ఆశ్బర్యపరచలేదని సబ్రే అన్నారు.


Also Read: టిబెట్‌ విషయంలో దలైలామా వెనక్కి తగ్గారా? స్వాతంత్య్రం వద్దనడం వెనక ఉద్దేశమేంటి?