Visakhapatnam Steel Plant News: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై యథాతథ స్థితి కొనసాగించే విధంగా కేంద్రం సంకేతాలు పంపించిందన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. విశాఖ ఉక్కు పబ్లిక్ సెక్టార్ లో కొనసాగాలంటే లాభాల బాట పట్టించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆస్తిగా ఉన్న పరిశ్రమ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. స్టీల్ ప్లాంట్ నష్టాలు, ఐరన్ ఓర్ మైనింగ్ ఇవ్వకపోవడం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిందా..? అంటూ ప్రశ్నించారు. 


విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఇప్పడిప్పుడే జరగదని జీవీఎల్ అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశం ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పిన ఆయన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను లాభసాటిగా నడిపించాలనేది తమ ప్రయత్నమన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ 30 వేల మంది ఉద్యోగులది మాత్రమే కాదని, ప్రజల ఆస్తి అని జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే స్టీల్‌ ప్లాంట్‌ నష్టాల్లో ఉందని ఆయన అన్నారు. 


విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు కేంద్రం, మోదీనే కారణమని తప్పుడు ప్రచారాలు చేయవద్దని కార్మిక సంఘాలను కోరుతున్నట్లు జీవీఎల్ చెప్పారు. స్టీల్‌‍ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే నడపాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో గత మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్ కారణంగా ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. బ్లాస్ట్ ఫర్నేస్-3ని ప్రారంభిస్తామని తెలిపారు. రాయబరేలిలో ఉన్న రైల్వే వీల్స్ ఫ్యాక్టరీ ద్వారా 2 వేల కోట్ల మూలధనం సమకూర్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ముడిసరుకు ఇచ్చేందుకు NMDC సిద్ధంగా ఉందని ఎంపీ జీవీఎల్‌ తెలిపారు. 


NMDC ఆధ్వర్యంలో పిల్లేట్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. అదే సమయంలో విశాఖ నుంచి వారణాసి ఎక్స్‌ప్రెస్‌ రైలు త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. చాలా సందర్భాల్లో రైల్వే మంత్రిని కలిసి రైలు ఏర్పాటు చేయాలని కోరామని, రైల్వే బోర్డు నుంచి వారణాసికి ఎక్స్‌ప్రెస్ రైలు నడిపేందుకు ఆమోదం వచ్చిందన్నారు. వారానికి రెండు రోజులు నడిపేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో దీన్ని రోజువారి రైలుగా నడిపే అవకాశం ఉందన్నారు. విజయదశమి లోపు ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు.


ఎన్నికల ముందు కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అంశం వ్యతిరేకతను తీసుకుని రాకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన ఉక్కు శాఖ సహాయమంత్రి కులస్తే స్టీల్ ప్లాంట్ సందర్శించాల్సి ఉంది. యాజమాన్యం, కార్మిక సంఘాలతో వేరు వేరుగా సమావేశమై కేంద్రం నిర్ణయం వెల్లడించాలని భావించారు. అయితే పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న కార్మికుల డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర మంత్రి పర్యటన రద్దు అయ్యింది. ఈ అంశానికి సంబంధించిన వివరాలను ఎంపీ జీవీఎల్ మీడియాకు వివరించారు.  


మరో ఆరేడు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ సమయంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు దూరంగా ఉండాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో దెబ్బతిన్నప్పటి నుంచి కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. విపరీతంగా పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారడంతో వాటి ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల గ్యాస్ ధరలను 200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని సమాచారం. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్ణయం కూడా అందులో భాగంగానే తీసుకున్నట్లు చర్చ సాగుతోంది.