ఇరాక్ నినెవేహ్‌ ప్రావిన్స్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. హమ్‌దానియా పట్టణంలోని ఓ పెళ్లి వేడుకలో పేల్చిన బాణసంచా కారణంగా, ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 114 మంది  మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మందికిపైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.ఇరాక్ రాజధాని బాగ్దాద్ కు వాయువ్యంగా 335 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. 


హమ్‌దానియా ప్రాంతంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిన్న రాత్రి పెళ్లి వేడుక జరుగుతుండగా ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు హాల్‌ అంతటా వ్యాపించాయి. వేడుకలో పాల్గొన్న అతిథులు, కుటుంబసభ్యులు అందులో చిక్కుకుపోయారు. ఈ వేడుకలో ఉపయోగించిన బాణాసంచా కారణంగానే మంటలు చేరిగినట్లు అధికారులు నిర్దారించారు. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన స్థలంలో ఎటు చూసినా సజీవ దహనమైన మృతదేహాలు కనిపించాయి. గాయపడిని వారిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కాపాడి వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు.


మంటలు భారీగా చెలరేగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మంటలు చెలరేగగానే హాల్ పాక్షికంగా కుప్పకూలిందని తెలిపారు. భారీ మంటలకు ధ్వంసమయ్యే నాసిరకం మెటీరియల్ తో ఈ భవనం నిర్మించినట్లు గుర్తించారు.