UAE President Demise : యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం కన్నుముశారు. దీంతో శనివారం సంతాప దినంగా పాటించాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ (MHA) ప్రకటించింది. సంతాప దినం నాడు భారత జాతీయ జెండాను క్రమం తప్పకుండా ఎగురవేసే అన్ని భవనాలపై సగం మాస్ట్‌లో ఎగరవేయాలని హోంశాఖ తెలిపింది. అలాగే అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవని పేర్కొంది. 






యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయెద్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మరణించారు. చమురు సంపన్న దేశానికి 2004 నుంచి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. జాయెద్ అల్ నహ్యాన్ అనారోగ్యంతో 73 సంవత్సరాల వయస్సులో మరణించారు. యూఏఈ అధ్యక్షుడి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారత్-యూఏఈ సంబంధాల అభివృద్ధికి షేక్ ఖలిపా ఎంతో కృషి చేశారమన్నారు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గల నాయకుడు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 






ప్రధాని మోదీ సంతాపం 


“హెచ్‌హెచ్ షేక్ ఖలిఫా బిన్ జాయెద్ మరణించిన విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. అతను గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గల నాయకుడు, అతని ఆధ్వర్యంలో భారతదేశం-యూఏఈ సంబంధాలు అభివృద్ధి చెందాయి.UAE ప్రజలకు భారతదేశ ప్రజల హృదయపూర్వక సంతాపం తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
జాయెద్ అల్ నహ్యాన్ భారత్-యూఏఈ బంధానికి పునాది వేశారని విదేశాంగ మంత్రి (ఈఏఎం) ఎస్ జైశంకర్ అన్నారు. "యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయెద్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు, దేశ ప్రజలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం" అని జైశంకర్ ట్వీట్ చేశారు. "యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను ఆధునీకరించిన నాయకుడిగా అతనను గుర్తుంచుకుంటారు. ఆయన భారత్-యూఏఈ సంబంధాల పరివర్తనకు పునాది వేశారు ”అని జైశంకర్ అన్నారు. 


కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంతాపం 


కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా యూఏఈ అధ్యక్షుడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. "యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణ వార్తను విని ఎంతో బాధపడ్డాను. దూరదృష్టి గల నాయకుడు, యూఏఈ అభివృద్ధికి మార్గనిర్దేశక సంస్కరణల చేసిన వ్యక్తి" అని ఆయన ట్వీట్ చేశారు.